Skip to main content

జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల శ‌క్తి విద్యకు మాత్రమే ఉంది: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల, సాధికారికత చేకూర్చగల శక్తి చదువుకు ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మ ఒడి, నాడు- నేడు, విద్యా దీవెన తదితర పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి , 100 శాతం అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. నేడు(సెప్టెంబ‌ర్ 8న‌) అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ఈమేరకు ట్వీట్‌ చేశారు. కాగా పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించే సీఎం జగన్‌ విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే 'అమ్మ ఒడి' అమలు చేస్తున్నారు. 'జగనన్న గోరుముద్ద' పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 'జగనన్న విద్యా కానుక'తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్‌ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు.

పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా...
అదే విధంగా మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధం చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Published date : 08 Sep 2020 03:45PM

Photo Stories