Skip to main content

జేఈఈ (మెయిన్) ఫిబ్రవరి సెషన్- 2021కు అడ్మిట్ కార్డులు విడుదల: గైడ్‌లైన్స్ ఇవిగో..

సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్‌కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్‌కు 5,04,540, మే సెషన్‌కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి.

జేఈఈ (మెయిన్)- 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్స్, ఆన్‌లైన ప్రాక్టీస్ టెస్ట్స్, కెరీర్ గెడైన్స్, మోడల్ పేపర్స్, కట్‌ఆఫ్ ర్యాంక్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అడ్మిట్ కార్డులు జరభద్రం
అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే..

  • జేఈఈమెయిన్.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఐఎన్ వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్‌లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు.
  • జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే.
  • అడ్మిట్‌కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి.
  • అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే 0120-6895200 నెంబర్‌లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్‌కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ-మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్-ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్లో కూడా సంప్రదించవచ్చు.


అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు..

  • పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి.
  • పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి.
  • ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి అండర్‌టేకింగ్ ప్రొఫార్మాను డౌన్‌లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి.
  • కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు.
  • మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు.
  • పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • రఫ్‌వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు.
  • పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్‌కు అందించాలి.
  • పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు.


నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి

  • అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  • పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
  • ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు.
  • అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది.
  • పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్‌లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్‌లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు.


పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు..
జామిట్రీ బాక్సు, హ్యాండ్‌బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు.

ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా..
ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్‌ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్‌లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లోని అప్‌డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది.

Published date : 15 Feb 2021 03:11PM

Photo Stories