‘జాతీయ విద్యావిధానంపై సలహాలివ్వండి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం-2020 పై కేంద్ర విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న జాతీయ విద్యా విధానం మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధిగమిస్తూ అత్యుత్తమ పాలసీని తీర్చిదిద్దేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గూగుల్లో innovateindia.mygov.in/ nep2020 పేజీ తెరిచి ముందుగా తమవివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అధ్యాయాల వారీగా సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియ ఈనెల 24వ తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ విధంగా వచ్చిన సలహాలను నిపుణుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Published date : 24 Aug 2020 02:30PM