Skip to main content

ఈసారికి నో డిటెన్షన్...నో టెన్షన్!

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో డిటెన్షన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
ఫైనలియర్‌కు మినహా ఆయా కోర్సుల్లోని మిగతా సంవత్సరాలకు డిటెన్షన్ నిలిపివేతను అమలు చేయాలని యోచిస్తోంది. తద్వారా డిగ్రీలో ప్రథమ, ద్వితీయ, ఇంజనీరింగ్‌లో వాటితోపాటు తృతీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసి (ఇప్పుడే నిర్వహించకుండా), ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం లాక్‌డౌన్ తరువాత యథావిధిగా నిర్వహించేలా కసరత్తు చేస్తోంది.

రిజిస్ట్రార్‌లతో మండలి చైర్మన్ చర్చలు..
ఉన్నతవిద్యలో వివిధ కోర్సులకు సంబంధించిన వార్షిక (సెమిస్టర్) పరీక్షలను ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చర్చలు జరిపారు. ప్రస్తుతానికి డిటెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపేసి ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగతా సంవత్సరాల విద్యార్థులను పైతరగతులకు పంపాలన్న అభిప్రాయానికి చైర్మన్, రిజిస్ట్రార్లు వచ్చారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

6.5 లక్షల మందికి తప్పనున్న టెన్షన్...
రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా వారిలో ఫైనలియర్ విద్యార్థులు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్నత విద్యా కోర్సుల వార్షిక పరీక్షలను (సెమిస్టర్) నిర్వహించాల్సి ఉంది. డిగ్రీలో ఫస్టియర్ విద్యార్థులకు రెండో సెమిస్టర్, సెకండియర్ వారికి నాలుగో సెమిస్టర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఆరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఇంజనీరింగ్‌లో రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్, ఆరో సెమిస్టర్‌తోపాటు 4వ సంవత్సర విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో ఆయా పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల్లోని ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగిలిన విద్యార్థులకు డిటెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపేసి పైతరగతికి (తర్వాతి సెమిస్టర్‌కు) ప్రమోట్ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుండటం విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ప్రస్తుతానికి పరీక్షల టెన్షన్ తప్పుతుందని విద్యార్థులు భావిస్తున్నారు.

ఎత్తివేత ఎందుకంటే..?
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమల్లోకి తెచ్చిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం నిబంధన ప్రకారం విద్యార్థుల ఒక సంవత్సరం చదువులో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉంటే ఆ తర్వాతి సంవత్సరంలోని సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. అదే డిటెన్షన్ విధానం కూడా. ఆ నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థులు ఉత్తీర్ణులు కాకుండా పైతరగతులకు ప్రమోట్ చేసే వీల్లేదు. అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ ఒక్క సెమిస్టర్‌కు డిటెన్షన్‌ను ఎత్తివేయాలని ఉన్నతవిద్యా మండలి నిర్ణయించింది.

తర్వాత నిర్వహిస్తాం...
పరీక్షలు నిర్వహించలేనందున వాటిని తర్వాత రాసేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేం దుకు ఈ చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. విద్యార్థులు ఆయా పరీక్షలను ఎప్పుడు రాయాల్సి ఉంటుందో తర్వాత నిర్ణయిస్తాం.
- ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి (ఉన్నతవిద్యా మండలి చైర్మన్)
Published date : 18 Apr 2020 03:29PM

Photo Stories