Skip to main content

ఇంటర్ కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లలో తప్పులు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మార్చి 17న జరిగిన ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు దొర్లాయి.
అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు గందరగోళపడ్డారు. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఆ తర్వాత అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఏయే ప్రశ్నల్లో ఉన్నాయో పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి, విద్యార్థులకు తెలియజేశారు. కామర్స్ తెలుగు మీడియం ఓల్డ్ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వాటికి జవాబులు రాసిన (తప్పైనా, ఒప్పైనా) వారందరికీ మార్కులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇక 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

పూర్తయిన ప్రథమ సంవత్సర ప్రధాన పరీక్షలు:
ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మార్చి 17తో పూర్తయ్యాయి. మార్చి 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు మార్చి 18తో పూర్తికానున్నాయి. మార్చి 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి.

ఇవీ ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు..
  • కామర్స్-1 తెలుగు మీడియం (ఓల్డ్ సిలబస్) సెక్షన్-డి 18వ ప్రశ్నలో డెబిట్ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్ నిలువలు అని ఉండాలి.
  • తెలుగు మీడియం (న్యూ సిలబస్) కామర్స్-1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి.
  • సెక్షన్-ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు అని ఉండాలి.
  • సెక్షన్-ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి. ఇదీ ప్రింట్ కాలేదు.
  • సెక్షన్-ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది.
  • సెక్షన్-జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది.
  • కెమిస్ట్రీ-1లో (ఇంగ్లిష్ మీడియం) సెక్షన్-బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో with an example అని ఉండాలి.
  • సెక్షన్-జీలో 27వ ప్రశ్నలో PAID CHEQUE బదులుగా PAID SALARIES అని ఉండాలి.
  • కెమిస్ట్రీ-1లో (తెలుగు మీడియం) సెక్షన్-బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి.
  • సెక్షన్-బీలో 16వ ప్రశ్నలో HYDIDE కు బదులుగా HYDRIDE అని ఉండాలి.
Published date : 18 Mar 2020 05:07PM

Photo Stories