Impact of COVID-19 on students: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో నూతనోత్సాహం..
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనాతో చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు పాఠశాలలు తెరవడంతో కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు.
‘నాడు–నేడు’తో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్న తమ పాఠశాలలు, అందిన జగనన్న విద్యా కానుక (పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు, సాక్సు, బూట్లు, బ్యాగు, బెల్టు, డిక్షనరీ, తదితర), మంచి రుచికరమైన భోజనం వారిలో సంతోషాన్ని నింపాయి. దీనికి తోడు చాలాకాలం తర్వాత తమ స్నేహితులు కలవడంతో చదువుల్లో చురుకుదనాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకురాలు కె.వెట్రిసెల్వి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి కృష్ణా జిల్లా మూలపాడు, కాచవరం, పరిటాల జెడ్పీ హైస్కూళ్లను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యాభ్యాసం.. ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నారు. 1వ తరగతిలో చేరిన విద్యార్థులతో మాట్లాడుతూ వారి సామర్థ్యాలను పరిశీలించారు. 2, 3 తరగతుల్లోని విద్యార్థులకు గణితంలో కొన్ని అంశాలపై సాధనలను ఇచ్చి జవాబులు రాబట్టారు. 3, 4, 5 తరగతుల వారిని ఆంగ్లంలో కొన్ని ప్రశ్నలు అడగ్గా విద్యార్థులు ఠక్కున సమాధానాలివ్వడంతో అధికారులు సంతోషించారు. చాలా కాలంగా ఇళ్ల వద్దనే ఉండిపోయిన పిల్లలు మానసికంగా ఒకింత సమస్యలకు గురైనా పాఠశాలల ప్రారంభంతో మామూలు స్థితికి చేరుకోవడంతోపాటు గతంలో కంటే చురుగ్గా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. విద్యార్థుల అభ్యసనం చక్కగా సాగుతోందని, గతంలో కంటే ఆనందంగా విద్యార్థులున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా, పాఠశాలల్లో నాడు–నేడు కింద జరిగిన పనులను అధికారులు పరిశీలించారు. మరుగుదొడ్లు, వాల్ పెయింట్లు, తరగతి గదులు, స్మార్ట్ టీవీ, తాగునీరు, మొక్కల పెంపకం, జగనన్న విద్యాకానుక కిట్లను తనిఖీ చేశారు.
Published date : 28 Aug 2021 03:40PM