Skip to main content

ఇంగ్లిష్ మీడియం.. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 97 శాతం పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు తీర్మానాలు చేశాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు.
ఇలా 48 వేలకు పైగా తీర్మానాలు తమకు అందాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లు, వారి పిల్లలు ఏ మీడియంలో చదివారో, చదువుతున్నారో ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతతో తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇదని కోర్టుకు తెలియజేశారు. ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్యను సులభంగా పూర్తి చేసి, మంచి ఉపాధి అవకాశాలు పొందుతారని తెలిపారు. ఏ భాషా మాధ్యమం ఉండాలన్న ఐచ్ఛికం ప్రభుత్వానికి ఉందని కోర్టుకు నివేదించారు.

మాతృభాషకు వచ్చిన నష్టం ఏమీ లేదు
ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆంగ్ల మాధ్యమం అమలు వల్ల మాతృభాషకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని, ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు అడ్డుకోలేవని అన్నారు. అంతకుముందు ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థిస్తూ న్యాయవాదులు పి.మహేశ్వరరావు, వైకే, డాక్టర్ చెల్లప్పలు వాదనలు వినిపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Published date : 14 Feb 2020 03:50PM

Photo Stories