Skip to main content

ఇకపై ఇంటి నుంచే డ్యూటీచేయాలని ఐటీ కంపెనీల నిర్ణయం!

సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 నేపథ్యంలో హైదరాబాద్‌లో గూగుల్, క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ సహా 20 వరకు బహుళజాతి ఐటీ కంపెనీలు మార్చి 16(సోమవారం)నుంచి తమ ఉద్యోగులను వర్క్‌ఫ్రం హోంకు అనుమతించనున్నాయి.
దాదాపు 600 ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలకు నిలయమైన నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మైండ్‌స్పేస్ ప్రాంతాల్లో 6 లక్షల మంది పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను సోమవారం నుంచి తలపై థర్మామీటరుతో శరీర ఉష్ణోగ్రత తనిఖీ చేసిన తరవాతే కంపెనీలలోకి అనుమతిస్తామని, అధిక జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఉద్యోగులను తాత్కాలికంగా ఇంటికి పంపించాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెజైస్ అసోసియేషన్ (హైసియా) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా, నగరంలోని మరో 400 వరకు ఉన్న చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోంకు ‘నో’ చెప్పాయి. ఉద్యోగులకు వ్యక్తిగతంగా ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కష్టం కావడం, కీలక సమావేశాలకు ఉద్యోగులను దూరంగా ఉంచితే సంస్థల రోజువారీ కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న అంచనాతో ఉద్యోగులు విధిగా కార్యాలయాలకు హాజరుకావాలని స్పష్టం చేసినట్లు హైసియా అధ్యక్షుడు మురళి ‘సాక్షి’కి తెలిపారు.

అన్ని కంపెనీలకు స్టాండర్డ్ ప్రొటోకాల్
కోవిడ్ నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌ఓపీ) రూపొందించి అన్నికంపెనీలకు అందజేసినట్టు మురళి తెలిపారు. ఇందులో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన సూచనలు, సమన్వయ కమిటీల ఏర్పాటు, అత్యవసర సమయాల్లో ఎవరికి ఫోన్ చేయాలి, ఉద్యోగులను ఏ ఆస్పత్రులకు తరలించాలనే వివరాలు పొందుపరిచామన్నారు. విదేశాలకు వెళ్లొచ్చిన ఉద్యోగులు కొన్నిరోజుల పాటు ఎలా ఐసోలేట్ కావాలో ఇందులో సూచించామన్నారు.
Published date : 16 Mar 2020 05:33PM

Photo Stories