Skip to main content

ఇక వర్క్‌ఫ్రమ్‌హోంకి వేరే జీతం..దీని ఆధారంగానే


న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ప్రభావం నుంచి కుదేలుకాకుండా ఐటీ రంగం కాస్తో కుస్తో జాగ్రత్త పడగలిగింది. భద్రత దృష్ట్యా ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌హోం వెసులుబాటు కల్పిస్తూనే.. ఇంకా ఎక్కువే అవుట్‌పుట్‌ రాబట్టుకుంటున్నాయి ఐటీ కంపెనీలు. అయితే ఆఫీస్‌ వర్క్‌కి-రిమోట్‌ వర్క్‌కి ఇక మీదట ఒకే రకమైన పే స్కేల్‌ ఉండకూడదని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గూగుల్‌ మొదటి అడుగు వేసింది. జీతభత్యాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ జూన్ 22వ తేదీన‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

 
ఎంత జీతం ఇవ్వాలన్నది..
వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగుల జీతభత్యాల విషయంలో గూగుల్‌ కొత్తగా ఒక టూల్‌ను ప్రవేశపెట్టింది. వర్క్‌ లొకేషన్‌ టూల్‌గా పిలుచుకుంటున్న ఈ టూల్‌.. సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌(జీవన వ్యయం), లోకల్‌ జాబ్‌ మార్కెట్‌ తదితర అంశాలను ఆ టూల్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది అడ్జస్ట్‌చేసి ఆ టూల్‌ లెక్కగట్టి చెప్తుంది. దీనితో పాటు వాళ్లకు అదనంగా ఇంకేం అందించాలనేది కూడా ఈ టూలే నిర్ణయిస్తుంది. దీనిప్రకారం ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేసుకోవాలి? అనేది వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, గూగుల్‌కి ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్లలో 60 శాతం మంది ఆఫీసులకే వచ్చే సూచనలు ఉన్నాయని గూగుల్‌ అంచనా వేస్తోంది. మరో 20 శాతం కొత్త ఆఫీస్‌ లొకేషన్స్‌లో పనికి సిద్ధం కావొచ్చని, మరో 20 శాతం ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం మీదే పని చేయొచ్చని అంచనా వేస్తోంది.
Published date : 24 Jun 2021 01:35PM

Photo Stories