Skip to main content

ఇక మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీలు..!

సాక్షి, హైదరాబాద్: మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 120 జూనియర్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభిస్తోంది.
తెలంగాణకు ముందు మైనార్టీలకు ప్రత్యేక గురుకుల సొసైటీ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మైనార్టీల విద్యావసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా 206 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నారు. పదో తరగతి వరకే అందుబాటులో ఉండటంతో ఉన్నత చదువుల కోసం తిరిగి ప్రైవేటుబాట పట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ వరకు ఈ విద్యా సంస్థలను అప్‌గ్రేడ్‌ చేయాలని మైనార్టీ గురుకుల సొసైటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

విడతల వారీగా ప్రారంభం...
మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 120 జూనియర్‌ కాలేజీలను ఎక్కడెక్కడ ప్రారంభించాలనే వివరాలతో ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో కొన్నింటినైనా అందుబాటులోకి తేవాలని సొసైటీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత విడతల వారీగా వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ముందుగా భవనాల లభ్యత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని... ఆయా ప్రాంతాల్లో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.
Published date : 08 Mar 2021 03:39PM

Photo Stories