‘ఈచ్ వన్-టీచ్ వన్’లో పోలీసుల భాగస్వామ్యం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్-టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుందని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
జనవరి 3 ( శుక్రవారం)న డీజీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యతా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో పాల్గొంటుందని చెప్పారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు. తమ రక్షణ కోసం పోలీసు శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరులలో కల్పించాలని చెప్పారు. దీనిలో భాగంగా సామాజిక అవ్యవస్థను అంతం చేసేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని తెలిపారు. మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే తమ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలని సూచించారు. పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ-రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ సంవత్సరంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు, ఐజీలు, సీనియర్ పోలీసు అధికారులతో పాటు ఇతర డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌ను అభినందించిన డీజీపీ..
పోలీసు ఉద్యోగం అంటే సామాజిక సేవ అని నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం అవసరమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం.. తన రక్తాన్ని దానం చేయడంతో ఆ మహిళకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డీజీపీ.. శ్రీశైలంను అభినందించారు.

Published date : 04 Jan 2020 01:00PM