Skip to main content

ఈచ్ వన్.. టీచ్ వన్‌లో అందరూ భాగస్వాములు కావాలి: సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, సిద్దిపేట: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, సంపూర్ణ అక్షరాస్యత సాధనలో కూడా ముందు ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శనివారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మల్టీపర్పస్ హైస్కూల్) ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అనేక మంది వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం గర్వకారణం అన్నారు. ఇంతటి చరిత్ర గల పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈచ్ వన్.. టీచ్ వన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నిరక్షరాస్యులు లేకుండా చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల క్రితం చదువుకున్న చదువులమ్మ ఒడిలోకి చేరిన వృద్ధులు కూడా ఇక్కడ చిన్న పిల్లల్లా కన్పిస్తున్నారని, వారు చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారని అన్నారు. ఏం చదివాం..ఏం చేస్తున్నాం అనడం కన్నా.. ఎక్కడ నేర్చుకున్నాం అన్నది ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాటి నుండి నేటి వరకు సిద్దిపేట అంటే ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలవడం అందరికీ గర్వకారణం అన్నారు. ఇదే పాఠశాలలో చదివి పార్లమెంట్ వరకు వెళ్లిన తాను ఏం చేసినా పాఠశాల రుణం తీర్చుకోలేనని, పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యా ర్థులు మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అర్ధశతాబ్దం క్రితం చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కలసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. గురువులను కలసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 10 Feb 2020 03:42PM

Photo Stories