ఈచ్ వన్.. టీచ్ వన్ అమలుకు వర్క్‌బుక్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన ‘ఈచ్ వన్-టీచ్ వన్’ కార్యక్రమానికి రాష్ట్ర వయోజన విద్య విభాగం సిద్ధం అవుతోంది.
ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.39 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండగా, మరింత తాజా సమాచారం కోసం గ్రామాలవారీ వివరాలు సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వర్క్‌బుక్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రత్యేక పాఠాలు పొందుపరుస్తోంది. మరోవైపు తెలుగు వర్ణమాల, గుణింతాలు మొత్తం వచ్చిన వారి కోసం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలను కుదించి అన్ని సబ్జెక్టులూ ఒకే పుస్తకంలో ఉండేలా రూపొందిస్తోంది. తెలుగు వర్ణమాలలోని అక్షరాలు నేర్పించేందుకు, అవి వచ్చిన వారికి వర్క్‌బుక్‌లోని పాఠ్యాంశాలు బోధించేందుకు నిర్ణీత గడువు విధించి పని చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో అక్షరాలు నేర్చుకున్నవారికి పరీక్షలు నిర్వహించి, మంచి మార్కులు సాధించిన వారిని అభినందించడం, బోధకు లకు సన్మానించడం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు వయోజన విద్యావిభాగం కసరత్తు చేస్తోంది. మరోవైపు చదువుకునేందుకు ముందు కొచ్చిన వారి వివరాలను రిజిస్టర్ చేయడానికి, ఒక వెబ్సైట్, వీలైతే ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించాలని భావిస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారనేది, కార్యక్రమం ఎలా సాగుతోందన్న సమగ్ర వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
Published date : 07 Jan 2020 02:25PM