ఈ కంపెనీలోని ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Sakshi Education
సాక్షి,ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
బోనస్‌లు, ప్రమోషన్లతో వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. 2019తో పోలిస్తే ఎక్కువగా తాజా బోనస్‌ను ప్రకటించింది. అలాగే 24,000 మందికి పైగా ఉద్యోగులను భారీగా ప్రమోట్ చేయనుంది. సంస్థ అట్రిషన్ (కంపెనీల మార్పు) తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. దేశీయంగా 24వేల మందికి ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికంనుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉద్యోగులకు బోనస్‌లను ఇవ్వనున్నామని నంబియార్ చెప్పారు. కాగా కాగ్నిజెంట్ డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కరెన్సీపరంగా ఇది వార్షిక ప్రాతిపదికన 3 శాతం క్షీణించింది. భారతదేశంలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. 2020 క్యూ 3 ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,89,500. సంస్థ మొత్తం అట్రిషన్ 19 శాతంగా ఉంది.
Published date : 05 Mar 2021 11:22AM