Skip to main content

ఈ ఏడాదే సీబీఎస్‌ఈ.. తొలుత 1 నుంచి 8 తరగతులకు..

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యుత్తమంగా రాణించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ దీన్ని వర్తింప చేస్తామన్నారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం సీబీఎస్‌ఈ బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఆంగ్లంపై మరింత పట్టు సాధించి మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఉపకరిస్తుందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు.. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, ఇళ్ల పట్టాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో నాడు –నేడు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్‌ కాలేజీలు, ఆర్‌ అండ్‌ బీ, వైఎస్‌ఆర్‌ బీమా, జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరాతోపాటు ఏప్రిల్‌లో అందించనున్న జగనన్న విద్యా దీవెన, రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, వలంటీర్లకు సత్కార కార్యక్రమాలపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాలపై సీఎం జగన్‌ ఏమన్నారంటే..

స్కూళ్లలో మార్చి 31కి నాడు – నేడు తొలివిడత పనులు పూర్తి
నాడు – నేడు కింద స్కూళ్లలో మొదటి విడతలో చేపట్టిన పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలి. పది రకాల సదుపాయాలు స్కూళ్లకు సమకూరుతున్నాయి. పెయింట్‌ పనులపై దృష్టి పెట్టాలి.

అంగన్‌ వాడీల్లో నాడు–నేడు..
వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కింద అంగ¯న్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నాం. చిన్నారుల్లో 6 ఏళ్ల లోపు వయసులోనే మెదడు 80 శాతం వరకూ అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈ వయసులో ఉన్న చిన్నారులపై దృష్టిపెట్టాం. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. భవనాల నిర్మాణం కోసం స్థలాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు శ్రద్ధ చూపాలి.

ఏప్రిల్‌లో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవీ..
ఈ ఏడాది ఏప్రిల్‌కు సంబంధించి పలు కార్యక్రమాల తేదీలను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఏవైనా దరఖాస్తులు ఉంటే పరిశీలన చేసి జాబితాలను సచివాలయాల్లో ఉంచాలని సూచించారు. అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన
ఏప్రిల్‌ 13న ఉగాదిరోజు వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి. వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులతో సత్కరించాలి. వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి. అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.
Published date : 17 Mar 2021 03:11PM

Photo Stories