Skip to main content

గ్రామీణ వైద్య బలోపేతానికే...డిప్లొమా కోర్సులు: ఎన్‌బీఈ అధ్యక్షుడు డా.అభిజత్ సేథ్

సాక్షి, హైదరాబాద్: దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైద్య శిక్షణ అందించేందుకు ప్రాంతీయ స్థాయిల్లోనే స్పెషలిస్ట్ కేడర్ రూపుదిద్దుకునేలా చేసే ముఖ్యోద్దేశంతో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) అధ్యక్షుడు డా. అభిజత్‌సేథ్ తెలిపారు.
ప్రాంతీయంగా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు డిప్లొమా కోర్సులు ఉపయోగ పడతాయని చెప్పారు. ‘డీఎన్‌బీ పాలియేటివ్ మెడిసిన్’ అనే కొత్త కోర్సు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. నీట్-పీజీ, నీట్-సూపర్ స్పెషాలిటీ, నీట్-ఎండీఎస్, ఎఫ్‌ఎంజీఈ, డీఎన్‌బీ-ఫైనల్ వంటి ఎన్‌బీఈ పరీక్షల నిర్వహణతోపాటు డీఎన్‌బీ వంటి డిప్లొమా కోర్సులకు సంబంధించి ఆసుపత్రులకు ఈ సంస్థ అక్రెడిటేషన్ ఇస్తుంది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన డా. అభిజత్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ముఖ్యాంశాలు...

సాక్షి: ఎన్‌బీఈ అక్రెడిటేషన్ ఎన్ని సీట్లకు?
అభిజత్: ప్రస్తుతం 10 వేల సీట్ల వరకు ఉండగా 2021లో డిప్లొమా కోర్సులు ప్రవేశ పెట్టాక ఇవి 12 వేలు దాటే అవకాశాలున్నాయి.

సాక్షి: వీటిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఏ మేరకు ఉండబోతోంది?
అభిజత్: దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ కూడా ఇందులో అగ్రభాగాన నిలుస్తోంది. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో పెరిగేందుకు మెండుగా అవకాశాలున్నాయి.

సాక్షి: జిల్లా స్థాయిల్లో పరిస్థితి ఏమిటి?
అభిజత్: ప్రసుత్తం ఎన్‌బీఈ అక్రిడిటేషన్ 78-79% ప్రైవేట్ రంగానికి, 21-22% ప్రభుత్వ రంగానికి వెళుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో 50 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. రెండేళ్ల డిప్లొమా కోర్సులను ప్రాంతీయ స్థాయిలో ప్రవేశపెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని గుర్తించాం.

సాక్షి: కోవిడ్ పరిస్థితుల్లో ప్రాక్టికల్స్ శిక్షణకు ఇబ్బందులున్నాయా?
అభిజత్: కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిమితుల్లో డాక్టర్లు క్లినికల్ ట్రైనింగ్ పొంద లేకపోతున్నారు. అందువల్ల ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాం. త్వరలోనే స్కిల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే 19 స్పెషాలిటీ వెబినార్ ట్రైనింగ్‌‌స మొదలుపెట్టాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్కిల్‌బేస్డ్ ట్రైనింగ్‌ను, ఢిల్లీలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం.

సాక్షి: ఏయే డిప్లొమా కోర్సులున్నాయి? మన దేశ కాల, పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయి?
అభిజత్: ఎన్‌బీఈ ఆధ్వర్యంలో డిప్లోమా కోర్సులను ప్రవేశపెట్టిందే దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైద్యపరమైన శిక్షణ అందించేందుకు. ప్రాంతీయ స్థాయిల్లోనే స్పెషలిస్ట్ కేడర్ రూపుదిద్దుకొనేలా చేయడం దీని ముఖ్యోద్దేశం. దేశవ్యాప్తంగా ఎనిమిది బేసిక్ ఏరియాల్లో డిప్లొమా కోర్సులు మొద లుపెడుతున్నాం. ఎన్‌బీఈ చేపడుతున్న వినూత్న శిక్షణకు రాష్ట్రాల్లోని భాగస్వా మ్యపక్షాల నుంచి మంచి స్పందన రావడం సంతోషకరం. ఇందుకోసం ఇప్పటికే 1,600 పైగా దరఖాస్తులు వచ్చాయి.

సాక్షి: 2021లో ఎన్ని సీట్లు పెరగొచ్చు?
అభిజత్: 2021లో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో 2-3 వేల సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. కోవిడ్ దృష్ట్యా కార్పొరేట్ ఆసుపత్రులు ట్రైనింగ్ అవకాశాలను కొంత కుదించొచ్చు.

సాక్షి:ఇన్-సర్వీస్ క్యాండిడేట్ల కోసం ఏవైనా రిజర్వేషన్లు ఉన్నాయా?
అభిజత్: వాటిని రిజర్వేషన్లుగా పరిగణిం చకపోయినా రాష్ట్ర సర్వీసెస్ ముఖ్యంగా జిల్లా ఆసుపత్రుల డీఎన్‌బీ కోర్సుల్లో 50% కోటాను సంబంధిత రాష్ట్రాలకు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ క్యాండిడేట్లను స్పాన్సర్ చేయొచ్చు. దీనివల్ల స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందే అవకాశాలుంటాయి. అందువల్లే ఈ కోటాను ప్రారంభించాం. రాష్ట్రాలు అవకాశాలను అంది పుచ్చుకోవడంలో బాగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ వైద్యశాఖ కమిషనర్లు మాతో సమావేశమయ్యారు.

సాక్షి: నీట్-పీజీ 2021 ఎప్పుడు?
అభిజత్: పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే దాన్ని ఎన్‌బీఈగా మేము చెప్పలేం. కేంద్ర వైద్యశాఖ పరిధిలోని నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి వచ్చే సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

సాక్షి: ఏవైనా కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నారా ?
అభిజత్: ఇప్పటికే కొన్ని డీఎన్‌బీ, ఫెల్లోషిప్ కోర్సులను ప్రారంభించాం. ‘డీఎన్‌బీ పాలియేటివ్ మెడిసిన్’ కోర్సును కొత్తగా మొదలుపెడుతున్నాం. ఇప్పటికే 12 ఫెల్లోషిప్ ప్రోగ్రామ్స్ అదనంగా చేరాయి. ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా త్వరలో మరిన్ని సబ్ స్పెషాలిటీ కోర్సులు ప్రవేశపెడతాం.

సాక్షి: తెలుగు రాష్ట్రాలు ఎన్ని సీట్లు పొందే అవకాశం ఉంది?
అభిజత్: డిప్లొమా కోర్సుల్లో ప్రభుత్వ సంస్థలు దరఖాస్తు చేసుకొనే దానికి అనుగుణంగా ఎన్‌బీఈ సహాయ, సహకారాలు అందిస్తుంది. అక్రెడిటేషన్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించిన పక్షంలో రాష్ట్రాలకు తప్పకుండా తోడ్పాటునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ అధికారులను నియమిస్తే ఎన్‌బీఏ-వైద్యశాఖల మధ్య మెరుగైన సమన్వయం, సహకారానికి అవకాశం ఉంటుంది.
Published date : 09 Nov 2020 03:54PM

Photo Stories