ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వరం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ ఒక్క విద్యార్థీ డబ్బులు లేక చదువు మానుకోకూడదనే రాష్ట్ర ప్రభుత్వ కృత నిశ్చయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జగనన్న వసతి దీవెన కింద హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు భోజనం, వసతి తదితర ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తోంది.
వసతికి భరోసా..
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన 3,90,532 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.306.89 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 3,36,964 మంది ఎస్సీ విద్యార్థులకు 265.50 కోట్లు, 53,568 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.41.39 కోట్లు ఖర్చు చేయడం ద్వారా వారి చదువులకు, వసతి సౌకర్యాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. గతంలో ప్రభుత్వాలు వసతి ఖర్చులకు చాలీ చాలని నిధులు ఇచ్చేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి వేసింది. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున ఖర్చు పెడుతోంది. గతంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవారు కాదు. పోస్టు మెట్రిక్ వారికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఐటీఐ అయితే సంవత్సరానికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు ప్రభుత్వం ఇస్తోంది. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులకు సంబంధించిన సొమ్మును కూడా.ఈ ఏడాది నుంచి తల్లి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫీజుల చింత లేదు...
జగనన్న విద్యా దీవెన పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన 3,77,270 మంది విద్యార్థులకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ743.35 కోట్లు ఖర్చు చేసింది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన 75,424 మంది విద్యార్థులకు రూ.113.95 కోట్లు ఖర్చు చేయడం ద్వారా పిల్లల ఫీజుల విషయంలో తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మధ్యలో చదువులు మానుకోవడానికి ఫీజులు కట్టలేని వారి పేదరికమే కారణం. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బయట పడ్డారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వగానే తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించడంతో పాటు విద్యార్థుల చదువుల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.