Skip to main content

ఏపీలో కేంద్ర వ్యవసాయ వర్సిటీ కోసం కసరత్తులు!

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర వ్యవసాయ విద్యాలయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఒకటి. ఈ మేరకు గత టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా లాంలోని ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయ వర్సిటీ హోదా కల్పించాలంటూ 2014 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక్కడే టీడీపీ సర్కారు తప్పటడుగు వేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్తగా కేంద్ర వ్యవసాయ వర్సిటీని కేంద్రమే పూర్తి వ్యయంతో, నిర్వహణతో సహా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ దిశగా టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా లాంలోని ఎన్‌జీ రంగా వర్సిటీకే కేంద్ర వ్యవసాయ వర్సిటీ హోదా కల్పించాలని చంద్రబాబు సర్కారు కోరింది.

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
కేంద్ర ప్రభుత్వం ఎన్‌జీ రంగా వర్సిటీకి కేంద్ర వ్యవసాయ వర్సిటీ హోదా కల్పించలేదు. కొత్తగా కేంద్ర వ్యవసాయ వర్సిటీని కూడా రాష్ట్రానికి మంజూరు చేయలేదు. ఎన్‌జీ రంగా వర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు చెందినది తప్ప కేంద్ర విశ్వవిద్యాలయం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2017 వరకు రూ.135 కోట్లు విడుదల చేయగా, ఆ నిధులతో ఎన్‌జీ రంగా వర్సిటీ ఆవరణలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భవనాలు నిర్మించింది. ఇలా నిధులను దారి మళ్లించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. 2018-19లో బడ్జెట్‌లో కేంద్రం రూ.65 కోట్లు కేటాయించినప్పటికీ, ఆ నిధులను విడుదల చేయకుండా నిలిపివేసింది. ముందుగా ఇచ్చిన రూ.135 కోట్లతో వ్యవసాయ వర్సిటీలో భవనాలు నిర్మించుకున్నారు కాబట్టి ఇక కొత్తగా కేంద్ర వ్యవసాయ వర్సిటీని మంజూరు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కేంద్ర వ్యవసాయ వర్సిటీని రాష్ట్రానికి మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
Published date : 02 Jan 2020 03:10PM

Photo Stories