Skip to main content

ఏపీకి 655 మంది విద్యుత్ ఉద్యోగులు రిలీవ్ !

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు జనవరి 4 (శనివారం)న 655 మంది ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేశాయి.
విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి కమిషన్ ఇటీవల సమర్పించిన తుది నివేదిక అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ఏపీకి కేటాయించిన విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయకుండా యథాతథస్థితిని కొనసాగించాలని కోరుతూ ఏపీ ట్రాన్స్ కో జేఎండీ శనివారం తెలంగాణ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీకి లేఖ రాశారు. తెలంగాణలో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ జాబితాలు ప్రకటించిన జస్టిస్ ధర్మాధికారి, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జాబితాలను ప్రకటించలేదని ఏపీ ట్రాన్స్ కో జేఎండీ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని, ఈ నివేదిక అమలును నిలుపుదల చేయాలని కోరుతూ ఇప్పటికే జస్టిస్ ధర్మాధికారికి లేఖ రాశామని వెల్లడించారు. జస్టిస్ ధర్మాధికారి జరిపిన కేటాయింపులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశామని, ఈ నేపథ్యంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తెలంగాణ నుంచి ఇప్పటికిప్పుడు రిలీవ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు. తుది నివేదిక అమలుకు ధర్మాధికారి కమిటీ 4 నెలల సమయం ఇచ్చిందని, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఒక వేళ ఏపీకి కేటాయించిన ఉద్యోగులను రిలీవ్ చేసినా, తాము వారిని విధుల్లో చేర్చుకుని పోస్టింగ్‌లు ఇవ్వమని, వారికోసం తమ దగ్గర ఖాళీ పోస్టులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలని పునరుద్ఘాటించారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం మరో మలుపు తిరిగినట్టు అయింది.

త్వరలో పదోన్నతులు, పోస్టింగ్‌లు
2015 జూన్ 10న తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్ చేయడం, వారిని విధుల్లో చేర్చుకోవడానికి ఏపీ నిరాకరించడంతో ఈ వివాదం హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాద పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారితో సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 28న ఏకసభ్య కమిషన్ నియమించింది. రెండు రాష్ట్రాల్లోని స్టేట్ కేడర్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి ఉద్యోగుల విభజన చేపట్టేందుకు తొలుత ధర్మాధికారి కమిషన్ మార్గదర్శకాలను ప్రకటించింది. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులతో పలు దఫాలుగా సమావేశమైన జస్టిస్ ధర్మాధికారి, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయనే స్వయంగా ఉద్యోగుల పంపకాలు జరుపుతూ గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. 1,157 మంది ఉద్యోగుల్లో ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందితో పాటు ఏ రాష్ట్రానికి ఆప్షన్లు ఇవ్వని 42 మందిని కలిపి 655 మందిని ఆయన ఏపీకి కేటాయించారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవై, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 229 మంది సెల్ఫ్ రిలీవ్‌‌డ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. తుది నివేదిక అమలు చేయడానికి, తుది కేటాయింపులకు అనుగుణంగా ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు కమిషన్ నాలుగు నెలల గడువు విధించింది. అయితే, ఈ తుది నివేదిక బయటికి వచ్చి రెండు వారాలు గడవకముందే తెలంగాణ విద్యుత్ సంస్థలు.. ఏపీకి కేటాయించిన ఉద్యోగులను రిలీవ్ చేయడం గమనార్హం. తెలంగాణకు కేటాయించిన 502 మంది ఉద్యోగులకు త్వరలో తెలంగాణ విద్యుత్ సంస్థలు పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు వారికి సీనియారిటీ ప్రకారం ఇప్పటికే రావాల్సిన పదోన్నతులు కల్పించాలని నిర్ణయించాయి. ఐదేళ్ల కింద వారిని రిలీవ్ చేసినా, ఇప్పుడు వారందరినీ తెలంగాణ ఉద్యోగులుగా చూసుకుంటామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
Published date : 06 Jan 2020 04:12PM

Photo Stories