Skip to main content

ఏపీ స్కూళ్లలో కేవలం 0.5 శాతమే పాజిటివిటీ: టీచర్లు, విద్యార్థులకు నిరంతరం కోవిడ్ పరీక్షలు

సాక్షి, అమరావతి: స్కూళ్లు ప్రారంభించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి భయపడినంతగా లేకపోవడంతో ఒకింత ఆందోళన తగ్గింది.

స్కూళ్లకు విద్యార్థులు వస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని చాలా మంది వాదించారు. స్కూళ్లు తెరవద్దని అన్నారు. కానీ ఇప్పటికే విద్యా సంవత్సరం తీవ్ర జాప్యం కావడంతో ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించింది. స్కూళ్లు తెరిచినప్పటి నుంచి ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ కేసులపై పర్యవేక్షిస్తూనే ఉంది. దీనిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులకు టెస్టులు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసులు బట్టి చూస్తే చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని స్కూళ్లలో జీరో శాతం పాజిటివిటీ ఉన్నట్లు స్పష్టమైంది. అత్యధికంగా నెల్లూరులో 0.7 శాతం కేసులు నమోదయ్యాయి. రోజువారీ రాష్ట్ర జనాభాకు చేసిన టెస్టులతో పోలిస్తే స్కూళ్ల పాజిటివిటీ రేటు చాలా తక్కువ. సగానికి పైగా జిల్లాల్లో 0.1 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. లక్షణాలున్నట్టు తేలితే వైద్య సిబ్బంది వెంటనే కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రతి నిత్యం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో పర్యవేక్షణ ఉంటోంది. కళాశాలల్లో 3,767 మంది విద్యార్థులు, 913 లెక్చరర్‌లకు టెస్టులు చేయగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

పెరిగిన హాజరు శాతం
ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్న తరగతులు ఆరోగ్యకర వాతావరణంలో నడుస్తున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోంది. దీపావళి ముందు వరకు 10వ తరగతి విద్యార్థులు 50.74 శాతం తరగతులకు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 39.57 శాతం హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు శాతం 45.15కు చేరింది. జూనియర్ కళాశాలల్లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాజరు 36.44 శాతం నమోదైంది.

సర్కారు ముందు చూపు

  • కోవిడ్-19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్‌మెంట్.. పద్ధతిని అనుసరిస్తూ ఖర్చుకు వెనుకాడకుండా తొలి నుంచీ భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేయిస్తోంది. వైరస్ సోకిన వారిని త్వరితగతిన గుర్తించి ఉచితంగా వైద్యం అందిస్తోంది.
  • ఇందుకోసం భారీ సంఖ్యలో కోవిడ్ కేర్ సెంటర్లను, కోవిడ్ ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అందుకు తగినట్లు యుద్ధ ప్రాతిపదికన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించింది. ఖరీదైన మందులను సైతం అందుబాటులోకి తెచ్చింది. మౌలిక వసతులను కల్పించింది. బలవర్థకమైన ఆహారాన్ని అందించింది.
  • ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల వైద్య రంగ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు వ్యక్తమవడం తెలిసిందే. దీంతో రోజుకు 70 వేలు, 80 వేల టెస్ట్‌లు చేస్తున్నా, ప్రస్తుతం పెద్దగా కేసులు నమోదవ్వడం లేదు.
  • మరోవైపు ఇతర రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నా ఇంత కంటే ఎక్కువ కేసులు వస్తుండటం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి నుంచీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు నిర్వహించడం వల్లే వైరస్‌ను నియంత్రించడంలో విజయం సాధిస్తోందని వైద్య రంగ ప్రముఖులు చెబుతున్నారు. నేడు కళాశాలల్లో ఒక్క కేసు కూడా రాలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడమే కారణమంటున్నారు.

కోవిడ్ టెస్ట్‌లు చేసిన స్కూళ్లు

36,627

టీచర్లకు కోవిడ్ టెస్టులు

1,22,050

పాజిటివ్‌గా నిర్ధారణ

1,001

విద్యార్థులకు కోవిడ్ టెస్టులు

1,65,318

పాజిటివ్‌గా నిర్ధారణ

416

కోవిడ్ టెస్ట్‌లు చేసిన కాలేజీలు

279

కాలేజీ విద్యార్థులకు పరీక్షలు

3,767

పాజిటివ్‌గా నిర్ధారణ

0

లెక్చరర్లకు కోవిడ్ టెస్టులు

913

పాజిటివ్‌గా నిర్ధారణ

0

మొత్తం పాజిటివిటీ రేటు

0.5%


అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం, పారిశుధ్యం విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.
- ఆదిమూలం సురేష్, విద్యా శాఖ మంత్రి

Published date : 17 Nov 2020 01:31PM

Photo Stories