ఏపీ పరీక్షల రద్దు నిర్ణయంపై ఆచరణాత్మక తీరు ప్రశంసనీయం: సుప్రీంకోర్టు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది.
రాష్ట్రాల బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ న్యాయవాది అనుభ శ్రీవాస్తవ సహాయ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘ధర్మాసనం ముందు విచారణ పురోగతిని పరిగణనలోకి తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలకు పేపర్లు పంపడం సహా పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అయినప్పటికీ గురువారం విచారణ సమయంలో ధర్మాసనం భావోద్వేగాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ధర్మాసనం భావోద్వేగాలను ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించారు. పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించాం. కోర్టు సూచించిన విధానాన్ని అనుసరిస్తాం’ అని దుష్యంత్ దవే పేర్కొన్నారు. 10 రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, నిపుణులైన విద్యావేత్తలను కమిటీలో నియమించి మూల్యాంకనానికి తగిన సూచనలు తీసుకుంటామని తెలిపారు. కోర్టు విధించిన కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. వాస్తవ అంశాలపై సున్నితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఊహించని ఘటనలు జరిగితే హృదయాలు బరువెక్కుతాయని, సంక్షోభంలో వాటిని చూశామని దవే పేర్కొనగా.. ఇది ఊహించనిది, కఠినమైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై దుష్యంత్ దవే స్పందిస్తూ.. ఎన్నికలు, కుంభమేళా ఇలా పలు అంశాల్లో ఎవరూ జవాబుదారీ తీసుకోలేదని, సామాన్యులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. అందుకే ఎవరినీ జవాబుదారీ చేయలేమని పేర్కొన్నారు. విషయం చెప్పగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. అని జస్టిస్ దినేష్ మహేశ్వరి పేర్కొన్నారు. ‘ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్నాం. పరిస్థితిని పునఃసమీక్షించి 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ వివరాలు రికార్డు చేస్తున్నాం. తగిన నోటిఫికేషన్ జారీచేయాలి. అన్ని రాష్ట్రాల బోర్డులు జూలై 31లోగా ఇంటర్నల్ అసెస్మెంట్ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించాలి. అన్ని బోర్డులు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించినందున ఇతరత్రా అంశాలపై విచారణ జరపాలని భావించడం లేదు’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.
‘ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఆచరణాత్మక, వాస్తవ అంశాల్లో సున్నితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వ తీరు ప్రశంసనీయం’
– సుప్రీంకోర్టు.
‘ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఆచరణాత్మక, వాస్తవ అంశాల్లో సున్నితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వ తీరు ప్రశంసనీయం’
– సుప్రీంకోర్టు.
Published date : 26 Jun 2021 02:06PM