Skip to main content

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో అభ్యసన నైపుణ్యాల పెంపుకు ‘శిక్షణ–ప్రేరణ’

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లోని 4–7 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు యునైటెడ్‌ నేషన్స్ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్‌ (యునిసెఫ్‌) సహకారంతో ‘శిక్షణ’ ఫౌండేషన్ సంస్థ ‘ప్రేరణ’ అనే ప్రత్యేక ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయనుంది.
ఈ విద్యాసంవత్సరం (2020–21)లో విజయనగరం జిల్లాలోని 5 మండలాల్లో 85 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న 5,103 మంది విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను మెరుగుపర్చనున్నారు. వివిధ వృత్తుల్లో కొనసాగుతూ స్వచ్ఛందంగా విద్యాసేవలు అందించేందుకు ప్రొఫెషనల్స్‌ కొంతమంది ఒక బృందంగా ఏర్పడి 2002లో ఈ ‘శిక్షణ’ సంస్థను ఏర్పాటుచేశారు. తరువాత ఇదే భావనతో ఉండే వారు పలువురు తోడవడంతో ఇదొక స్వచ్ఛంద సంస్థగా మారి అట్టడుగు వర్గాల పిల్లల్లో విద్యాప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ రాష్ట్రంలోని 2,060 స్కూళ్లలో ఈ కార్యక్రమాలను అమలు చేసింది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సంస్థ ఈ కార్యక్రమాలు చేపట్టింది. స్టూడెంట్స్‌ మోటివేషన్, కస్టమైజ్డ్‌ ప్రాక్టీస్, ప్రాజెక్టు బేస్డ్‌ లెర్నింగ్, స్టూడెంటు మెంటరింగ్, మానిటరింగ్, ఇవాల్యుయేషన్ దశలుగా ఈ సంస్థ ఆయా కార్యక్రమాలు చేపట్టనుంది.

‘ప్రేరణ’లో ఏం చేస్తారంటే..
  • విద్యార్థులకు స్టార్‌ రేటింగ్‌ ఇవ్వడం ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహిస్తారు.
  • తద్వారా వారు తరగతుల్లో టీచర్లు ఇచ్చే అభ్యసనాలను వర్కుబుక్కుల ద్వారా, హోంవర్కుల ద్వారా పూర్తిచేసేలా ప్రోత్సహిస్తారు.
  • స్కూళ్లలో పాఠ్యేతర కార్యక్రమాలను అమలు చేసి విద్యార్థులను భాగస్వాములను చేస్తారు.
  • విద్యార్థుల పురోగతిని అనుసరించి వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.
  • గణితం, భాషా నైపుణ్యాలను వర్కుబుక్కుల ప్రాక్టీసు ద్వారా పెంపొందిస్తారు.
  • ప్రభుత్వం ఇచ్చే వర్కుబుక్కులు లేదా ప్రేరణ కార్యక్రమం కింద శిక్షణ ఫౌండేషన్ అమలు చేసే మాడ్యూల్స్‌ ద్వారా విద్యార్థులు గణితం, భాషాంశాలను అభ్యసిస్తారు.
  • ఇంగ్లిష్‌ వర్కుబుక్కులు, ప్రేరణ ప్రాజెక్టు మాడ్యూల్స్‌ ద్వారా ఆంగ్ల నైపుణ్యాలను అలవరుస్తారు.
  • పిల్లలకు ప్రాజెక్టు వర్కులు ఇచ్చి వాటిని అభ్యసించడంలో తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర మిత్రులతో కలసి విద్యార్థులు చర్చించి వాటిని పూర్తిచేసేలా చేస్తారు.
  • శిక్షణ సంస్థ కొంతమంది వలంటీర్లను ఏర్పాటుచేసి వారిని విద్యార్థులకు మార్గనిర్దేశకులుగా నియమిస్తుంది. విద్యార్థులందరికి ఇంగ్లిషు ప్రాజెక్టులను ఇస్తుంది. శిక్షణ సంస్థ కొంత మెటీరియల్‌ ఇస్తుంది. వాటిని ఎలా ఉపయోగించాలో మెంటార్లు విద్యార్థులకు బోధిస్తారు.
  • స్కూలు కమ్యూనిటీ సభ్యులతో మెంటార్లు సమావేశమై విద్యార్థులకు ఎలా సహకరించాలో సూచనలు చేస్తారు. స్థానికంగానే కమ్యూనిటీ వలంటీర్లను ఏర్పాటు చేయించి విద్యార్థులకు సహకరించేలా చేస్తారు.
  • నారాయణ హెల్త్‌ (బెంగళూరు) సంస్థ ద్వారా శిక్షణ పొందిన ఈ మెంటార్లు కోవిడ్‌కు సంబంధించిన జాగ్రత్తలపై విద్యార్థులు, టీచర్లు, కమ్యూనిటీ సభ్యులకు సూచనలు చేస్తారు.
Published date : 26 Mar 2021 03:29PM

Photo Stories