Skip to main content

ఏపీ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగానే ఫీజులు.. లేదంటే కఠిన చర్యలు..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.
ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతో విద్యాసంస్థలను నడపాలని ప్రభుత్వ నిబంధనలున్నా ఫీజులపై స్పష్టమైన ఆదేశాలు లేవు. గతంలో ప్రైవేటు విద్యాసంస్థలపై జీవో నంబరు 1 విడుదల చేసినా దాన్ని పట్టించుకునేవారే లేరు. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ ఇష్టానుసారం సాగింది. ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు మరింతగా దోపిడీకి దిగాయి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేశాయి. ఈ పరిస్థితిని మార్చడంతోపాటు పాఠశాల విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్‌ జారీచేసినా న్యాయవివాదంతో అమలు కాలేదు. వాటిని పరిష్కరించుకుని ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కొద్దిరోజుల కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం మంగళవారం జీవో 53, 54లను విడుదల చేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది. ట్యూషన్‌, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్‌, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, స్టూడెంట్‌ వెల్ఫేర్, స్టూడెంట్‌ హెల్త్‌ కేర్, స్టడీ టూర్‌ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది.

కాలేజీల యజమానులు, తల్లిదండ్రుల హర్షం
ఈ చరిత్రాత్మక జీవోలపట్ల ప్రైవేటు కాలేజీల యజమానులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ఇతర నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ కబంధహస్తాల్లో నలిగిపోతున్న తల్లిదండ్రులు ఈ జీవోలతో ఊపిరి పీల్చుకోగలుగుతారని, కార్పొరేట్‌ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఇలాంటి ఫీజుల నిర్ణయం కోసం పోరాడుతున్నామని, ఇన్నాళ్లకు ఇది సాకారమైందని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి చెప్పారు. ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు ఫీజులు ఖరారు చేయడం ఆనందదాయకమని రాష్ట్ర ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీల ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు త్రివిక్రమ్‌ పేర్కొన్నారు.

ఈ జీవోల్లో పేర్కొన్న మరికొన్ని నిబంధనలు
  • కేపిటేషన్‌ ఫీజు వసూలు చేయరాదు.
  • పాఠశాలల్లో జేఈఈ, నీట్‌ కోచింగ్‌ పేరిట అదనంగాసొమ్ము వసూలు చేయకూడదు.
  • కాలేజీల్లో జేఈఈ, నీట్‌ తదితర అదనపు కోచింగ్‌లకు రూ.20 వేల వరకు మాత్రమే తీసుకోవాలి.
  • ఆయా కోచింగ్‌లు, హాస్టళ్ల నిర్వహణకు సంబంధిత విభాగాల అనుమతి తీసుకోవాలి.
  • ఫీజులతో పాటు ఇతర రికార్డులన్నీ క్రమపద్ధతిలో నిర్వహించాలి.
  • విద్యార్థులను చేర్చడానికి వచ్చే తల్లిదండ్రులకు ఫీజులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి. ఫీజులకు సంబంధించిన రశీదులను వారికి ఇవ్వాలి.
  • తమ వద్దే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదు.
  • యూనిఫాం అయిదేళ్ల వరకు మార్చకూడదు.
  • బోధన, బోధనేతర సిబ్బంది అర్హతలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఇతర ఖర్చుల రికార్డులను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపర్చాలి.
  • ఫీజు రూపంలో వసూలు చేసే మొత్తంలో 50 శాతాన్ని సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించాలి.
  • 15 శాతం నిధులను గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్‌ ఇన్సూరెన్సులకు కేటాయించాలి.
  • 15 శాతం నిధులను సంస్థ నిర్వహణకు (అద్దె, విద్యుత్తు చార్జీలు, ఇతర ఖర్చులకు) .
  • 20 శాతం నిధులను విద్యాసంస్థ అభివృద్ధికి కేటాయించాలి. అదనపు భవనాల నిర్మాణం, పాఠశాల అప్‌గ్రెడేషన్‌, కాలేజీల్లో అదనపువినియోగించాలి.
  • కోర్సుల ఏర్పాటు తదితరాలకు ఖర్చుచేయాలి.
  • ఈ ఫీజులు 2021–22 నుంచి మూడేళ్లకు వర్తిస్తాయి.
  • ఏదైనా విద్యాసంస్థకు గుర్తింపు కొనసాగని పక్షంలో ఆ సంస్థ ఈ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

ప్రాంతాలు, తరగతుల వారీగా
పాఠశాలల ఫీజు (రూపాయల్లో)
ప్రాంతం

ప్రైమరీ (నర్సరీ–5) తరగతులు

సెకండరీ (6–10) తరగతులు

పంచాయతీ

10,000

12,000

మునిసిపాలిటీ

11,000

15,000

కార్పొరేషన్‌

12,000

18,000


ప్రాంతాలు, గ్రూపుల వారీగా జూనియర్‌ కాలేజీల ఫీజు (రూపాయల్లో)

ప్రాంతం

ఎంపీసీ/బైపీసీ

సీఈసీ/హెచ్‌ఈసీ

పంచాయతీ

15,000

12,000

మునిసిపాలిటీ

17,500

15,000

కార్పొరేషన్‌

20,000

18,000


స్కూళ్లు, కాలేజీల్లో హాస్టళ్ల ఫీజు (రూపాయల్లో)

ప్రాంతం

స్కూలు/కాలేజీ

పంచాయతీ

18,000

మునిసిపాలిటీ

20,000

కార్పొరేషన్‌

24,000

Published date : 25 Aug 2021 02:04PM

Photo Stories