ఏపీ నిట్ క్యాంపస్: రెండో దశ పనుల విస్తరణ కు పణాళిక
రానున్న కాలంలో నిట్‌లో బీటెక్ ఇన్‌టేక్ సీట్లు 850, పీజీ సీట్లు 300, ఎంటెక్ సీట్లు 300, పీహెచ్‌డీ సీట్లు 300కు పెరుగుతాయని అంచనా.రానున్న ఐదేళ్ల కాలంలో దశలవారీగా పెరగనున్న సీట్లు, అందుకు అనుగుణంగా నిర్మించే శాశ్వత భవనాలు, ఇతర సౌకర్యాల నిమిత్తం ఎంత ఖర్చవుతుందనే అంచనాలను డీపీఆర్ రూపంలో రూపొందిస్తున్నారు. భవనాల నిర్మాణంలో భాగంగా వన్, వన్-బీగా పేర్కొనే భవనాల నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ పనులు పూర్తవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే కేంద్ర ఆర్థిక శాఖ సమావేశంలో డీపీఆర్‌కు ఆమోద ముద్ర లభిస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు
రాష్ట్ర విభజన అనంతరం తాడేపల్లిగూడెంలో ఏర్పాటైన ఏపీ నిట్ ప్రాంగణంలో తొలి దశలో రూ.415 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించారు. బాలికల కోసం 5, బాలుర కోసం 7 వసతి గృహాలు నిర్మించారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2 వేల మంది విద్యార్థులకు సరిపడా వసతి ఉంది. పరిపాలనా భవనం, డొక్కా సీతమ్మ మెస్, వర్క్‌షాప్, ల్యాబ్ కాంప్లెక్స్, లైబ్రరీ, జిమ్, క్రీడా ప్రాంగణాలు, ప్రెసిడెన్షియల్ సూట్ గల గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. డెరైక్టర్ బంగ్లా ఇటీవలే పూర్తయి్యంది.
రూ.800 కోట్లతో భవనాల నిర్మాణం
రానున్న ఐదేళ్లలో నిట్‌లో పెరగనున్న సీట్లను అంచనా వేసి రూ.800 కోట్లతో భవనాల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి విభాగానికి ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్, ఇండస్ట్రియల్ కొలాబ్రేషన్ సెల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, అధ్యయనం, పరిశోధనల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చేరే విదేశాల విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహం, ఫ్యాకల్టీ, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. నిట్‌లో విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని భవిష్యత్ అవసరాల కోసం 4.5 మెగావాట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్‌లో మిగులుతున్న 200 కిలోవాట్స్ విద్యుత్‌ను భవిష్యత్‌లో గ్రిడ్‌కు ఇవ్వకుండానే నిట్ అవసరాలకే వినియోగించుకునేలా ప్రతిపాదించారు. నిట్ క్యాంపస్‌కు రెండో వైపున కూడా గేట్ ఏర్పాటు చేయనున్నారు.
విద్యుత్ బస్సులకు ప్రతిపాదనలు
కాలుష్య నివారణలో భాగంగా క్యాంపస్‌లో విద్యుత్ బస్సులు నడపడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. వీటి కొనుగోలుకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యువబుల్ ఎనర్జీ రాయితీ ఇవ్వనుంది.
8 కోర్సులు
ఏపీ నిట్‌లో ప్రస్తుతం బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ) కోర్సులు ఉన్నాయి. వీటిలో 2019-20 వరకు 480 సీట్లు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 120 సీట్లతోపాటు సూపర్ న్యూమరరీ కోటా కింద వచ్చిన మూడు సీట్లతో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 603కు పెరిగాయి. ఎంటెక్‌లో ఆరు కోర్సులు, ఐదు డిపార్టుమెంట్‌లు, ఉన్నాయి. రానున్న కాలంలో సీట్ల సంఖ్య మరింత పెరగనుంది.
బీఓజీ అనుమతి రావాలి
రెండో దశ భవనాల నిర్మాణాల నిమిత్తం ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. వీటికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అనుమతి రావాల్సి ఉంది.
- సీఎస్‌పీ రావు, డెరైక్టర్, ఏపీ నిట్