Skip to main content

ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. కొత్త ‘వీసీ’ రాలే...!

భైంసా(ముధోల్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీ (వైస్‌ చాన్స్‌లర్‌)లను నియమించింది.
కానీ బాసర ట్రిపుల్‌ ఐటీకి వీసీ నియామకం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (బాసర– ఆర్జీయూకేటీ)కి మాత్రం ఇన్‌చార్జి వీసీ పాలనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెగ్యులర్‌ వీసీ లేకపోవడంతో ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ఇడుపులపాయ, నూజీవీడు, బాసరలో ఆర్జేయూకేటీ పేరుతో ట్రిపుల్‌ ఐటీలను అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్‌ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. పాలనపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ట్రిపుల్‌ ఐటీ ప్రారంభంలో ఓయూ వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన కొనసాగిన అనంతరం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా రాహుల్‌ బొజ్జ కొనసాగుతున్నారు.

ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..
బాసర ట్రిపుల్‌ ఐటీలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది రెగ్యులర్‌ వీసీ నియామకం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కోర్సులో భాగంగా ఇక్కడ ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 300 మంది వరకు టీచింగ్‌ స్టాఫ్, వెయ్యి మంది వరకు బోధనేతర సిబ్బంది ఉంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తున్న ఈ వర్సిటీలో ప్రవేశాలకు ఏటా పోటీ విపరీతంగా ఉంటుంది.

అయితే ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించిన వారంతా ఇన్‌చార్జీలే కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిమితులకు లోబడే పని చేస్తున్నారు. ఇది ట్రిపుల్‌ఐటీ ప్రగతికి అవరోధంగా మారింది. విద్యాలయ ప్రగతికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అలాగే యూనివర్సిటీ నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్‌ కౌన్సిలింగ్, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్ల పరిధిలోనే ఇన్‌చార్జీ వీసీలు నిర్ణయాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విద్యాలయంలో చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ఇన్‌చార్జి వీసీలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికి ‘విజిటింగ్‌’కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధానిలో కీలకవిధి నిర్వహణలో ఉండేవారికే ఇక్కడ ఇన్‌చార్జి వీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు సైతం పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీసీ ప్రత్యక్ష పర్యవేక్షణ కరువై పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ వీసీ నియామకంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

సమస్యలెన్నో..
  • ఇక్కడ చదివే విద్యార్థులు భోజనం, వసతి, విద్యాబోధన తదితర అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
  • కొంతమంది అధికారులు విద్యాలయంలో ఆధిపత్యం చెలయిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు విద్యార్థులు సైతం ఆందోళన బాటపట్టారు.
  • టీచింగ్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌లో ఖాళీలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.
Published date : 09 Jun 2021 05:52PM

Photo Stories