Skip to main content

ఏబీఆర్‌వై పథకం: ఉద్యోగకల్పనకు రూ. 23,000 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకం పట్టాలెక్కనుంది.

ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.22,810 కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కోవిడ్ రికవరీ దశలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అలాగే సంస్థాగత రంగంలో ఉపాధిని పెంపునకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020-23) గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కేబినెట్ సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వివరించారు.

పథకం సంగతిదీ...
1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. అయితే, 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు, 2020 అక్టోబర్ 1 తేదీకి ముందు ఈపీఎఫ్‌ఓలో నమోదైన ఏ సంస్థలో కూడా పనిచేయని, యూనివర్సల్ పర్మనెంట్ నంబర్ (యూఏఎన్) లేని ఒక ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి) ఈ స్కీమ్‌కు అర్హుడు. కోవిడ్ సమయంలో, 2020 మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి), సెప్టెంబర్ 30, 2020 వరకూ ఈపీఎఫ్‌ఓ కవరేజీ ఉన్న ఏ సంస్థలోనూ చేరకుండా ఉన్నా కూడా ఈ స్కీమ్ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన సభ్యుల ఖాతాలోకి ఎలక్ట్రానిక్ విధానంలో భవిష్య నిధి వాటా మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ జమ చేస్తుంది.

కేబినెట్ ఇతర నిర్ణయాలు..

  • కోచి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం. దీనికి రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
  • భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి ఓకే.
  • భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందం.
Published date : 10 Dec 2020 04:17PM

Photo Stories