డిగ్రీ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు’
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని, అలాకాని పక్షంలో సంబంధిత కళాశాలలపై పెనాల్టీలు విధించడంతోపాటు ఇతర చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ మండలి కార్యదర్శి ఎన్. రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న జారీ చేసిన జీవోలో పేర్కొన్న ఫీజుల కంటే కొన్ని కళాశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా ఫీజు వసూలు చేయడాన్ని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణిస్తామని, అలా చేయడం రాష్ట్రంలో నిషిద్ధమని గుర్తు చేశారు.
Published date : 09 Apr 2021 02:46PM