డెంటల్ సీట్ల భర్తీపై కేంద్రం స్పందనేంటో చూస్తాం: సుప్రీంకోర్టు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీపై కేంద్ర ప్రభుత్వ స్పందనేంటో చూస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక డెంటల్ కాలేజీల అసోసియేషన్లు, 20 ప్రైవేటు కాలేజీలు, కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్‌సింగ్, రమేష్ అల్లంకి వాదనలు వినిపిస్తూ.. దేశవ్యాప్తంగా 23,000కు పైగా సీట్లు ఖాళీగా ఉండడంతో కౌన్సెలింగ్ గడువు తొలుత జనవరి 15కు, తర్వాత జనవరి 31 వరకు పెంచారని తెలిపారు. అయినా కూడా జనవరి 23 నాటికి 9,000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏపీలో 1,440 సీట్లకు గాను 421 సీట్లు, తెలంగాణలో 1,125కు గాను 415 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. కేంద్రం స్పందనేంటో చూస్తామని పేర్కొంది. విచారణను 28కి వాయిదా వేసింది.
Published date : 26 Jan 2021 04:20PM