చదువు, నైపుణ్యాభివృద్ధిపై 2021-2022 బడ్జెట్ ప్రత్యేక దృష్టి ఇలా...
మంత్రి ప్రసంగంలో ఇంకా ముఖ్యాంశాలు ఇలా..
పాఠశాల విద్య
- కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 15,000 నమూనా పాఠశాలలు ఏర్పాటు. ఆయా ప్రాంతాల్లోని ఇతర పాఠశాలలకు ఇవి అన్ని విధాలా దిక్సూచిగా నిలిచి మార్గనిర్దేశం చేస్తాయి. విద్యా సమూహాన్ని సృష్టించి, రాబోయే రోజుల్లో దశల వారీగా కొత్త విద్యా విధానాన్ని రూపొందించడంలో సహాయ పడతాయి.
- స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేట్ క్రీడాకారులు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 100 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటవుతాయి. సైనిక్ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ సొసైటీ స్థాపించి, నిర్వహిస్తోంది. దేశంలో ప్రస్తుతం 30కి పైగా సైనిక్ పాఠశాలలు ఉన్నాయి.
ఉన్నత విద్య
- స్టాండర్డ్ (ప్రామాణిక) - సెట్టింగ్ (అమరిక), అక్రెడిటేషన్ (గుర్తింపు), రెగ్యులేషన్ (నియంత్రణ), ఫండింగ్ (నిధులు) కోసం నాలుగు వేర్వేరు విభాగాల ఏర్పాటుతో అంబ్రెల్లా స్ట్రక్చర్‌లో భారతదేశ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కోసం చట్టం చేస్తాం.
- అంబ్రెల్లా స్ట్రక్చర్ విధానం వల్ల ఆయా నగరాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయం, వనరుల భాగస్వామ్యం, బోధన అభ్యాసానికి సహకారం, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) పరంగా మంచి ఫలితాలు ఉంటాయి.
- తద్వారా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల మధ్య కూడా సహకారం పెరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని 40 ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు పరస్పరం నేర్చుకోవడం ద్వారా విద్యా విధానం మెరుగవుతుంది. ‘గ్లూ గ్రాంట్’ ద్వారా విద్యా రంగానికి ఊతం లభిస్తుంది.
- లద్దాఖ్‌లోని లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
- ఈ బడ్జెట్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యకు మరింత ఊతం ఇచ్చింది. కొత్తగా దేశంలో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ తరహా స్కూలు నిర్మాణానికి గతంలో రూ.20 కోట్లు ఇస్తుండగా ఈ బడ్జెట్‌లో రూ.38 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.48 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
- షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కేటాయింపులు పెంచారు. ఈ కేటాయింపులు రానున్న ఐదేళ్ల కాలం ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుదల వల్ల దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.50 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే జగనన్న వసతి దీవెన కింద అన్ని వర్గాల పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే.
కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఈసారి లేనట్లే!
రాష్ట్రంలో జిల్లాకో కొత్త కేంద్రీయ విద్యాలయం(కేవీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఈసారి అనుమతి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వీటి ఏర్పాటుకు రెండు, మూడేళ్లుగా సంప్రదింపులు జరుగుతుండగా కేంద్రం 10 కేవీల ఏర్పాటుకు గతేడాది ఓకే చెప్పింది. వాటిని రాష్ట్రంలోని వరంగల్ రూరల్, సిద్ధిపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఒక్కో కేవీకి కనీసం 2 ఎకరాల స్థలం కేటాయించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు గుర్తించి నివేదికలను కేంద్రం ఆమోదం కోసం 2019లో పంపించింది. గతేడాది బడ్జెట్ సమయంలో వాటికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికలు లేకపోవడంతో అప్పట్లో ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. అయితే ఆ తరువాత కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఆయా కేవీల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో 15 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తామని, 100 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. అయితే, ఇందులో కేవీల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తుందా? లేదా? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న రాష్ట్ర కేవీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని వాటి ఏర్పాటుకు ఓకే చెబుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
- బోర్డు పరీక్షలను సులభతరం, కోర్ కాన్సెప్ట్‌లకు తగ్గట్టు పాఠ్యాంశాల తగ్గింపు. 10 + 2 నిర్మాణాన్ని 5 + 3 + 3 + 4 గా మార్చడంతో పాటు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో కనీసం 5వ తరగతి వరకు బోధన.
- కేంద్రీయ విద్యాలయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6,800 కోట్ల బడ్జెట్ కేటాయింపు. గత ఏడాది కేటాయించిన రూ.5,516 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతానికి పైగా ఎక్కువ.
- నవోదయ విద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపును రూ.500 కోట్లు పెంచారు. గతేడాది రూ.3,300 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,800 కోట్లు కేటాయించారు.
- మధ్యాహ్న భోజన పథకంలో రూ.500 కోట్ల పెరుగుదల కనిపించింది. గత ఏడాది రూ.11,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.11,500 కోట్లకు పెంచారు.
- నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్) కింద ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థుల్లో నైపుణ్య శిక్షణ కోసం రూ.3000 కోట్లు కేటాయింపు. నైపుణ్యం, సాంకేతికత బదిలీ కోసం జపాన్ సహకారంతో శిక్షణ.
- నైపుణ్య అర్హతలు, అంచనా, ధ్రువీకరణ, సర్టిఫికేషన్ కోసం యూఏఈ సహకారం.
- కోవిడ్-19 నేపథ్యంలోనూ 30 లక్షల మందికి పైగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్‌గా శిక్షణ. 2021-22లో 56 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్‌స అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్‌సమెంట్ (నిస్తా) ద్వారా శిక్షణ ఇస్తాం.
- పరీక్షలు, రొటీన్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత తగ్గించి.. విశ్లేషణాత్మక నైపుణ్యం, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా విద్యార్థులను పరీక్షిస్తాం.
- కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి ప్రతి ఏడాది సీబీఎస్‌సీ బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతున్నారు. ఈ దిశలో సీబీఎస్‌సీ బోర్డు 2022-23 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా పరీక్షల్లో సంస్కరణలను అమలు చేస్తుంది.
- వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం, దేశ వ్యాప్తంగా భారతీయ సంకేత భాష ఆధారంగా జాతీయ, రాష్ట్ర పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నాం.
- విదేశీ ఉన్నత విద్యా సంస్థలతో మెరుగైన విద్యా సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ద్వంద్వ డిగ్రీలు, ఉమ్మడి డిగ్రీలు ఇతరత్రా అవసరాల కోసం ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
- విద్యా సంస్థలు, ఆస్పత్రులను నడుపుతున్న చిన్న చారిటబుల్ ట్రస్టులపై సమ్మతి భారాన్ని తగ్గించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటి వరకు ఉన్న వార్షిక రసీదు మొత్తం రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నాం.
పాఠశాల విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో)
2019-20 | 2020-21 | 2021-22 | |
కేంద్రీయ విద్యా సంఘటన్ | 6,331.40 | 5,516.50 | 6,800 |
నవోదయ విద్యాలయ సమితి | 3387.60 | 3,300 | 3800 |
ఎన్‌సీఈఆర్‌టీ | 276.05 | 300 | 500 |
సమగ్ర శిక్ష అభియాన్ | 32,376.52 | 38,750.50 | 31,050.16 |
ఉపాధ్యాయ శిక్షణ, వయోజన విద్య | - | 110 | 250 |
మధ్యాహ్న భోజన పథకం | 9,699 | 11,000 | 11,500 |
మదర్సాలు, మైనార్టీ విద్య నేషనల్ కౌన్సిల్ ఆఫ్ | 70.94 | 220 | - |
ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ | - | - | 495 |
ఉన్నత విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో)
| 2019-20 | 2020-21 | 2021-22 |
ప్రపంచస్థాయి విద్యా సంస్థలు మొత్తం కాలేజీలు, యూనివర్సిటీ | 224.10 | 500 | 1,710 |
విద్యార్థులకు ఆర్థిక సాయం | 2,069.95 | 2,316 | 2,482.32 |
మొత్తం డిజిటల్ ఇండియా ఇ-లెర్నింగ్ | 457.58 | 444.40 | 645.61 |
పరిశోధన, ఆవిష్కరణలకు | 257.08 | 307.40 | 237.40 |
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ | 4,435.58 | 4,693.20 | 4,693.20 |
ఏఐసీటీఈ | 436 | 416 | 416 |
సెంట్రల్ యూనివర్సిటీలకు గ్రాంట్లు | 7,988.84 | 7643.26 | 7643.26 |
సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ | - | 60.35 | 60.35 |
ఏపీ, తెలంగాణ గిరిజన వర్సిటీలు | 0.63 | 53.80 | 53.80 |
డీమ్డ్ యూనివర్సిటీలు | 418.02 | 351 | 351 |
ఐఐటీలు | 6,365.92 | 7,182 | 7,536.02 |
ఐఐటీ హైదరాబాద్ | 230 | 150 | 150 |
ఐఐఎమ్ | 481.29 | 476 | 476 |
ఎన్‌ఐటీ | 3,486.60 | 3,885 | 3,935 |
ఐఐఎస్‌ఈఆర్ | 791.22 8 | 96 | 946 |
ఐఐఎస్ | 596.48 | 591.65 | 621.65 |
ఐఐఐటీలు | 328.33 | 393.35 | 393.35 |
విద్యా రంగానికి మొత్తం కేటాయింపులు : రూ.93,224.31 కోట్లు
గతేడాది మొత్తం కేటాయింపులు : 99,311.52 కోట్లు
రంగంపై పెడుతున్న ఖర్చు | జీడీపీ %లో |
2014-15 | 2.8 |
2015-16 | 2.8 |
2016-17 | 2.8 |
2017-18 | 2.8 |
2018-19 | 2.8 |
2019-20 | 3 |
2020-21 | 3.5 |