Skip to main content

భావి అవసరాలు తీర్చేలా నూతన విద్యావిధానం: ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: భారత్‌ గత సంవత్సరం ఆవిష్కరించిన నూతన విద్యా విధానం భవిష్యత్‌ అవసరాలను తీర్చగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునే జ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే డాక్టర్‌ ఎస్‌ రాధాకృష్ణన్ ఆకాంక్షను తీర్చేదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు భారత సామాజిక జీవనంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. అహ్మదాబాద్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్ ఆఫ్‌ ఇండియన్ యూనివర్సిటీస్‌’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్ల జాతీయ సెమినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించారు. ప్రతీ విద్యారి్థకి వేర్వేరు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థి సామర్థ్యం ఏమిటి? సరిగ్గా బోధిస్తే ఏ స్థాయికి వెళ్లగలడు? ఆ విద్యార్థి లక్ష్యం ఏమిటి? అనే అంశాలను విశ్లేíÙంచాలి’ అని సూచించారు. కృత్రిమ మేథ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డేటా, 3డీ ప్రింటింగ్, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మొబైల్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ హెల్త్‌ కేర్, రక్షణ తదితర రంగాల్లో భారత్‌ను యావత్‌ ప్రపంచం దిక్సూచిగా చూస్తోందన్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం మూడు నగరాల్లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జ్ఞానం, ఆత్మగౌరవం, మర్యాదపూర్వక వ్యవహారశైలిని అంబేద్కర్‌ గౌరవించేవారన్నారు. ఆయన చూపిన ఈ మార్గంలో నడిచే బాధ్యతను మన విద్యాలయాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్‌పై కిశోర్‌ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు.
Published date : 15 Apr 2021 04:09PM

Photo Stories