బ్రేకింగ్ న్యూస్: ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు..ఫలితాలు అప్పుడే..
విజయవాడలో జూన్ 24వ తేదీన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఎవాల్యుయేషన్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్ షెడ్యూల్‌లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్‌గా ఇదే టైమ్ షెడ్యూల్ ఉంది.
పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు టెన్త్ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్‌లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్‌గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షలు, ఫలితాల వెల్లడికి కనీసం 45 రోజులు పడుతుంది
‘12వ తరగతి (ఇంటర్మీడియట్)కు సంబంధించి మార్కులు పదిరోజుల్లోపల ఫైనలైజ్ చేయాలని, మొత్తం ఫలితాలు జూలై 31 లోపల ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయం అవసరం. దీనికి అదనంగా 15 రోజులు ముందుగా విద్యార్థులకు టైమ్‌టేబుల్ సమాచారం ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ పూర్తిచేయడానికి కనీసం 45 రోజులు పడుతుందని గతంలో కూడా పలుమార్లు చెబుతూ వచ్చాం. ఆ మేరకు సమయం ఉంటేనే ప్రాసెస్ అంతా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ఆదేశాల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అనగా జూలై 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి తెలియచేశాం. ఈ విషయంపై పూర్తిగా చర్చించాం.
సుప్రీంకోర్టు గడువు తేదీలను పేర్కొంటూ చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని చెప్పింది. అంతకు ముందు ఉన్నతవిద్య ప్రవేశాలకు సంబంధించి యూజీసీకి కొన్ని ఆదేశాలు, సూచనలు ఇచ్చింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ, స్టేట్‌బోర్డులు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉన్నతవిద్య కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలను చేపట్టాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చి ఉంది. యూజీసీ కూడా ఉన్నతవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను జూలై 31 తరువాత చేపడతామని ప్రకటించింది. కనుక దేశమంతా ఒకే పద్ధతి వస్తున్న పరిస్థితుల్లో మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో, వేరే సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వీలుకాదు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ థియరీ పరీక్షలు 2020–21ని రద్దుచేస్తున్నాం. అదేవిధంగా ఇవే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలను కూడా రద్దుచేస్తున్నాం..’ అని మంత్రి సురేష్ చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పరీక్షల విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్థావస్థ లేనేలేదని స్పష్టం చేశారు. ‘ప్రారంభం నుంచి ఈరోజు (గురువారం) ఉదయం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేవరకు కూడా కోవిడ్–19 ప్రొటోకాల్ నిబంధనలన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామనే మేం చెబుతూ వచ్చాం. ప్రతి గదికి 15 మంది విద్యార్థులుండేలా చూడడం, భౌతికదూరం పాటించడం, కోవిడ్–19 ప్రొటోకాల్‌లోని చివరి అంశం వరకు అన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతోనే ఉన్నాం. పరీక్షల నిర్వహణ అనేదే మా మొదటి ప్రాధాన్యం. పరీక్షల రద్దు అనేది రెండో ఆప్షన్ మాత్రమే. మా ముఖ్యమంత్రి మొదటినుంచి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. పరీక్షలు నిర్వహించడానికే మేము ముందునుంచి ప్రయత్నిస్తున్నాం.అదే విషయాన్ని అఫిడవిట్‌లో కూడా స్పష్టంగా చెప్పాం.
జూలై 27లోగా..
పరీక్షల విషయంలో ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా లేదు. అఫిడవిట్‌లో కూడా పరీక్షలు ఎలా నిర్వహిస్తామో అన్న అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నాం. మొదటి నుంచి కూడా పరీక్షల నిర్వహణకు ఎన్నిరోజులు ఉండాలో చెబుతూ వస్తున్నాం. పరీక్షల నోటిఫికేషన్ నుంచి విద్యార్థులు సన్నద్ధం అవ్వడానికి తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు కనీసం 15 రోజులైనా సమయం ఇచ్చి తరువాత పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్‌లో 7 పేపర్లున్నాయి. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందే షెడ్యూల్ కూడా ఇచ్చాం. జూలై 27లోగా పూర్తిచేయాలనుకున్నాం. ఆ తరువాత ఎవాల్యుయేషన్‌కు 15 రోజులు. అనంతరం ఇతర ప్రక్రియలను పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలనుకున్నాం. గౌరవ న్యాయస్థానం గడువులను నిర్దేశిస్తూ వాటిని అనుసరించి ముందుకెళ్లాలని ఆదేశించినందున మాకు మరో ఆప్షన్ లేదు.
రెండో ఆప్షన్‌గా..
కోర్టు ఆదేశించిన టైమ్ షెడ్యూల్‌లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది’ అని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను నెలరోజుల కిందటే తాము ప్రకటించామని గుర్తుచేస్తూ ఆ షెడ్యూల్ ప్రతిని చూపారు. ‘పరీక్షలను జూలై 7 నుంచి ప్రారంభిస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నాం. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్వహిస్తారని అడగలేదు. ఎలా నిర్వహిస్తారని మాత్రమే అడిగింది. అదే విషయం చెప్పాం. ఏయే ప్రక్రియలను దశలవారీగా ఎలా నిర్వహిస్తామో కూడా కోర్టుకు చెప్పాం. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వంలో తొలినుంచి ఎలాంటి సందిగ్ధతా లేదు..’ అని మంత్రి స్పష్టం చేశారు.
మార్కుల కేటాయింపు ఈ సూచనల మేరకు..
‘ఆయా తరగతులకు సంబంధించిన మార్కులను ఏ పద్ధతుల్లో కేటాయించాలన్న దానిపై త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తాం. మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్‌ఈ సవివర గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఎలా అసెస్‌మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్‌మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు.