Skip to main content

బోధనా వైద్యులకు రూ. 35 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాల పెరుగుదల: ఏపీ సర్కార్

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచింది.
వీరికి యూజీసీ మాదిరిగా పే స్కేల్‌ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పెంచిన వేతనాలు 2016 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే అప్పటినుంచి ఇవ్వాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని అధికారులు తెలిపారు. ఆయా కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకు వారి కేడర్‌ను బట్టి రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాల పెరుగుదల ఉంటుందని వైద్యవిద్య వర్గాలు వెల్లడించాయి. వేతనాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు గతేడాది సెప్టెంబర్‌లోనే వచ్చాయి. అయితే అప్పుడు ఇచ్చిన జీవోను అమలు చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అప్పటి జీవోను అమలు చేసేలా తాజాగా ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చింది. ఏ కేడర్‌లో ఎవరికి ఎంత వేతనం పెరుగుతుందనేది తాజా జీవోలో స్పష్టత ఇచ్చారు. ఆయా కాలేజీలకు చెందిన ఏడీఎంఈ/ ప్రిన్సిపాల్‌/ సూపరింటెండెంట్లకు నెలకు పరిపాలన అలవెన్స్ కింద రూ.10 వేలు ఇస్తారు. డీఎంఈ/డీఎంఈ (అకడమిక్‌)లకు నెలకు రూ.12 వేలు ఇస్తారు. రాష్ట్రంలో కేడర్‌ అడ్వాన్స్ మెంట్‌ స్కీంను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ స్కీం కింద ప్రమోషన్లను నిర్ణీత కాలంలోనే ఇస్తారు. పెరిగిన వేతనాల వల్ల నిర్ణీత కాలంలో ప్రమోషన్లు తీసుకునే వారంతా ప్రయోజనం పొందుతారు.

నూతన పే స్కేల్‌ వివరాలు..
  • ట్యూటర్‌కు రూ. 57,700–1,82,400
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ. 68,900– 2,05,500
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లేదా డిజిగ్నేటెడ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ.79,800– 2,11,500
  • మూడేళ్లు దాటిన డిజిగ్నేటెడ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌:రూ.1,21,200–2,06,200
  • మూడేళ్లు దాటిన అసోసియేట్, డిజిగ్నేటెడ్‌ ప్రొఫెసర్‌: రూ.1,31,400–2,17,100
  • ప్రొఫెసర్‌/మూడేళ్ల డిజిగ్నేటెడ్‌ ప్రొఫెసర్‌: రూ.1,44,200–2,18,200
  • నాలుగేళ్ల అనుభవం కలిగిన ప్రొఫెసర్‌: రూ.1,46,900–2,22,300
  • ఎనిమిదేళ్లు పైబడి అనుభవమున్న రెగ్యులర్‌ ప్రొఫెసర్, అడిషనల్‌ డీఎంఈ, డీఎంఈ: రూ.1,49,600–2,42,200
Published date : 10 Mar 2021 04:29PM

Photo Stories