Skip to main content

బోధన, బోధనేతర సిబ్బంది వివరాల్లో ప్రైవేటు స్కూళ్ల మాయ!

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఉధృతి వేళ ప్రైవేటు స్కూళ్ల మాయాజాలం మరోసారి బయటపడింది.
స్కూళ్ల మూసివేత వల్ల ఆర్థిక ఇబ్బందులు పడు తున్న ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు వివరాలు సమర్పించాలని ఆదేశించగా యాజమాన్యాలు తప్పుడు లెక్కలు సమర్పించాయి. ఫలితంగా స్కూళ్లలో పనిచేసినా 81,661 మంది ప్రైవేటు సిబ్బంది ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు.

81,661 మందికి నష్టం..
రూ. 2 వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం కోసం 2,06,345 మంది బోధన, బోధనేతర సిబ్బంది (1,53,525 మంది టీచర్లు, 52,820 మంది బోధనేతర సిబ్బంది) దరఖాస్తు చేసుకోగా వారిలో 1,12,048 మంది బోధన సిబ్బంది, 12,636 మంది బోధనేతర సిబ్బందే ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది. దీంతో మరో 41,477 మంది టీచర్లు, 40,184 మంది బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా 81,661 మంది ఆర్థిక సాయానికి అనర్హులయ్యారు.

గతేడాది లెక్కల ప్రకారమే...
ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని రికార్డుల్లోని లెక్కల ప్రకారమే ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించినందున 2020 మార్చి నాటికి తమ రికార్డుల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బందికే ఈ పథకాన్ని అందించేలా నిబంధన విధించింది. అయితే అప్పుడు తప్పుడు లెక్కలు సమర్పించిన యాజమాన్యాలు... తాజాగా ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో వాస్తవ లెక్కలు బయటపెట్టాయి. అయితే , 1,12,048 మంది బోధన సిబ్బంది, 12,636 మంది బోధనేతర సిబ్బందే అర్హులని జిల్లా విద్యాశాఖాధికారులు తేల్చారు. వాస్తవానికి 100 మంది పిల్లలున్న స్కూల్లో కూడా ఇద్దరు బోధనేతర సిబ్బంది అవసరం అవుతారు. అలాంటిది రాష్ట్రంలోని 10,923 ప్రైవేటు పాఠశాలలకుగాను 7 వేలకుపైగా స్కూళ్లలో ఒక్కో దాంట్లో 300 మందికిపైగా ఎక్కువ మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన చూసినా బోధనేతర సిబ్బంది వేలలో ఉన్నట్లే. యాజమాన్యాలు ఇచి్చనవి తప్పుడు లెక్కలేనని, వాస్తవంగా ఇపుడు ఆర్థిక సహాయం కోసం చేసుకున్న దరఖాస్తుల ప్రకారం బోధనేతర సిబ్బంది 52,820 ఉన్నట్లు తేలిపోయింది.
  • రాష్ట్రవ్యాప్తంగా 10,923 ప్రైవేటు స్కూళ్లు ఉంటే అందులో కేవలం 12,636 మంది బోధనేతర సిబ్బందే ఉన్నారట. అంటే సగటున ఒక్కో స్కూల్లో ఇద్దరు చొప్పున కూడా బోధనేతర సిబ్బంది లేరన్నమాట.
  • ఇక టీచర్ల విషయానికి వస్తే ప్రైవేటు స్కూళ్లలో 1,53,525 మంది టీచర్లు ఉంటే అధికారిక లెక్కల ప్రకారం 1,12,048 మంది బోధన సిబ్బందే పనిచేస్తున్నట్లు యాజమాన్యాలు లెక్కలు చూపాయి.

ప్రభుత్వం ఆదుకోవాలి..
నేను 11 ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పని చేస్తున్నా. స్కూళ్ల మూసివేతతో జీతం రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా. ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందనుకుంటే విద్యాశాఖ లెక్కల్లో నా పేరు లేదన్నారు. విద్యాశాఖ లెక్కలతో సంబంధం లేకుండా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
–నరేశ్‌

మేమెలా బాధ్యులం?
యాజమాన్యాలు లెక్కలు ఇవ్వకపోతే మేమెలా బాధ్యులం? మేము పని చేసింది వాస్తవమే. కావాలంటే ఎంక్వయిరీ చేసి తెలుసుకోండి. మేము పని చేశామా లేదా? అన్నది తెలుస్తుంది. లెక్కల్లో మా వివరాలు లేవని ఆర్థిక సహాయం నిరాకరిస్తే ఎలా?
– మార్కండేయ

ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఇంతేనా?
ఏళ్ల తరబడి ప్రైవేటు టీచర్‌గానే పని చేస్తున్నా. అయినా ‘యూ–డైస్‌’లో నా వివరాలు లేకపోవడం ఏమిటి? మా వివరాలు యాజమాన్యాలు ఇవ్వకపోతే మాకు అన్యాయం చేస్తారా? కష్టకాలంలో ప్రభుత్వ సహాయం అందుతుందని అనుకుంటే ఇలా చేయడం ఏమిటి? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు సాయం చేయాలి.
– జి.వేణుగోపాల్‌

Published date : 24 Apr 2021 04:07PM

Photo Stories