బీఈడీ సీట్ల భర్తీకి ‘స్పాట్’ పేరుతో అడ్డదారి!
Sakshi Education
సాక్షి, అమరావతి: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌కు ఏటేటా అభ్యర్థులు కరువవుతున్నారు. ప్రవేశ పరీక్షకు అరకొరగా అందుతున్న దరఖాస్తుల్లోనూ చివరకు పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మరింత స్వల్పంగా ఉంటోంది.
2019 సెట్లలో ఇలా...
అంతిమంగా అర్హత సాధించేవారి సంఖ్య సగం కూడా దాటడం లేదు. ఫలితంగా కన్వీనర్ కోటాలో భర్తీ కావలసిన వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది.
- రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో 11, ప్రైవేట్‌లో 455 బీఈడీ కాలేజీలుండగా వీటిల్లో కన్వీనర్ కోటాలో 32,054 సీట్లున్నాయి.
- ఎడ్‌సెట్ 2020కి 15,658 మంది దరఖాస్తు చేసుకోగా 10,363 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
- 2019 ఎడ్‌సెట్‌లో కన్వీనర్ కోటాలోని 32,054 సీట్లకు గాను 4,575 (14 శాతం) సీట్లే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 1,056 సీట్లలో 734 సీట్లు భర్తీ కాగా ప్రైవేట్ కాలేజీల్లోని 30,998 సీట్లలో 3,841 మాత్రమే భర్తీ అయ్యాయి.
- ఎడ్‌సెట్ రాసిన వారి సంఖ్య మొత్తం సీట్లతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉండగా అర్హులు మరింత తక్కువగా ఉన్నారు.
- మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల పేరిట కాలేజీలు ఇష్టానుసారంగా భర్తీ చేసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 2019లో కన్వీనర్ కోటాలో భర్తీ అయినవి 4,575 సీట్లే అయినా చివరకు వచ్చేసరికి స్పాట్ పేరిట కాలేజీలు 20 వేల వరకు సీట్లు భర్తీ చేసుకున్నాయి.
- స్పాట్ అడ్మిషన్ల పేరిట పలు కాలేజీలు ఎడ్‌సెట్‌లో క్వాలిఫై కానివారిని, అసలు పరీక్ష రాయని వారిని సైతం చేర్చుకుంటూ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రికార్డుల్లో చూపిస్తున్నాయి. బీఈడీతోపాటు ఇతర సెట్లలోనూ ఇదే తంతు సాగుతోంది.
2019 సెట్లలో ఇలా...
సెట్‌పేరు | మొత్తం సీట్లు | కన్వీనర్ కోటా | స్పాట్ | బీ కేటగిరీ | ఖాళీ |
ఎంసెట్(ఎంపీసీ) | 1,41,897 | 58,807 | 887 | 22,900 | 5,9303 |
ఎంసెట్(బైపీసీ) | 12,203 | 7,405 | 527 | 2,312 | 1,959 |
ఐసెట్ | 55,538 | 24,959 | 1,139 | 7,625 | 21,815 |
పీజీఈసెట్ | 27,613 | 9,838 | 270 | 2,635 | 14,870 |
ఎడ్‌సెట్ | 41,894 | 3,874 | 19,665 | 7,849 | 10,506 |
పీఈసెట్ | 7,253 | 1,031 | 1,018 | 662 | 4,542 |
లాసెట్ | 10,117 | 3,456 | 3,846 | 1,602 | 1,213 |
Published date : 05 Oct 2020 03:31PM