Skip to main content

అత్యధిక ఉన్నత విద్యా సంస్థలు ఉన్న టాప్‌–8 రాష్ట్రాల్లో ఏపీకి స్థానం..!

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌ రాష్ట్రాల జాబితాలో నిలిచింది.
ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ గురువారం విడుదల చేశారు. ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్‌ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్‌–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఏపీకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34, రాజస్థాన్‌లో 37 మాత్రమే కావడం గమనార్హం. కాలేజీల సంఖ్యా పరంగా ఆలిండియా యావరేజ్‌ 30 కాగా ఏపీలో 51 ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలున్నాయి.

ఏపీ జోరు ఇలా..
  • దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54 శాతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
  • విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక (10,231) మొదటి స్థానంలో ఉండగా ఏపీ (2,094) 9వ స్థానం, తెలంగాణ (2,261) ఏడో స్థానంలో నిలిచాయి.
  • దేశంలో టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4 శాతం మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ నాలుగో స్థానంలో ఉండడం విశేషం.
  • దేశంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 27.1 శాతంగా ఉండగా.. ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో మహిళలు 30 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో నిలిచింది.

జాతీయ స్థాయిలో ఇలా..
  • జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది (85 శాతం) ఆరు డిసిప్లిన్‌ కోర్సుల్లోనే చేరారు. వీరంతా హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్‌ సైన్స్, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ విభాగాల్లో ఉన్నారు.
  • పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది పీహెచ్‌డీలో చేరారు.
  • దేశంలో 2019–20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులుండగా వీరిలో 42.5 శాతం మంది మహిళలు.
  • ఉన్నత విద్యలో 2019–20లో 3.85 కోట్ల మేర చేరికలున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే.

సర్వే జరిగింది ఇలా..
దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు సర్వేకు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. దేశంలో 1,043 యూనివర్సిటీలు, 42,343 కాలేజీలు, 11,779 స్టాండ్‌ ఎలోన్‌ (ఒకే విభాగానికి సంబంధించిన కోర్సులను అందించేవి) విద్యాసంస్థలున్న సంగతి తెలిసిందే. వీటిలో 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 స్టాండ్‌ ఎలోన్‌ సంస్థలు సర్వేకు గణాంకాలను సమర్పించాయి. తక్కినవి స్పందించలేదు. దేశంలో ఉన్నత విద్యా రంగం గత ఐదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏ మేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు 2015–16 నుంచి 2019–20 మధ్య 11.4 శాతం మేర పెరిగాయి. ఇందులో మహిళల చేరికలు 18.2 శాతం పెరగడం విశేషం.

దేశంలో 2014–15 నుంచి 2019–20 వరకు ఉన్నత విద్యారంగంలో ఆయా సంస్థలు..

కేటగిరీ

2014–15

2018–19

2019–20

యూనివర్సిటీలు

760

993

1,043

కాలేజీలు

38,498

39,931

42,343

స్టాండ్‌ ఎలోన్‌

12,276

10,725

11,779

Published date : 11 Jun 2021 12:45PM

Photo Stories