అటెన్షన్: సాయుధ బలగాల్లో దివ్యాంగులకు నో రిజర్వేషన్
Sakshi Education
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తదితర కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో యుద్ధక్షేత్రంలో విధులకు సంబంధించిన ఉద్యోగ నియామకాలకు ‘దివ్యాంగులకు కోటా’ నుంచి మినహాయింపు నిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రణరంగంలో నేరుగా పాల్గొనాల్సిన విధులు నిర్వర్తించే ఉద్యోగాలను ‘దివ్యాంగులకు కోటా’ పరిధి నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ కేంద్రప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీచేసింది. అంతకుముందు బుధవారం ఇచ్చిన నోటిఫకేషన్‌లో.. ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఢిల్లీ, అండమాన్– నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్– డయ్యూ, దాద్రా నగర్–హవేలీ పోలీస్ సర్వీస్‌లు, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్‌లోని అన్ని కేటగిరీలను దివ్యాంగులకు కోటా పరిధి నుంచి మినహాయింపునిచ్చింది. ఆ నోటిఫికేషన్‌ను సవరిస్తూ కేవలం పోరాటం, యుద్ధక్షేత్రాల్లో నేరుగా పాల్గొనే ఉద్యోగాలనే దివ్యాంగుల కోటా పరిధి నుంచి మినహాయింపునిస్తున్నట్లు తాజా నోటిఫికేషన్ ఇచ్చింది. ‘ప్రభుత్వం అనుమతించిన వైకల్యం స్థాయి (బెంచ్‌మార్క్ డిజబిలిటీస్)’ ఉన్న దివ్యాంగులకు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్–2016లోని 20, 34వ సెక్షన్ల ప్రకారం సాయుధ బలగాల్లో ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకూ రిజర్వేషన్ కోటా కల్పిస్తున్నారు. అయితే యుద్ధక్షేత్రాల్లో శత్రువుతో నేరుగా తలపడే సందర్భాల్లో వైకల్యంలేని తోటి సాయుధునితో ధీటుగా వీరు పోరాటపటిమను ప్రదర్శించలేకపోతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్‌ను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లోని బీఎస్‌ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్‌లను ‘దివ్యాంగులకు కోటా పరిధి’ నుంచి మినహాయించారు. ఈ నిర్ణయంపై హక్కుల పరిరక్షణ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే ఈ కోటా కింద ఉద్యోగం పొందిన దివ్యాంగులపైనా ఈ ప్రభావం పడుతుందని నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిజేబుల్ పీపుల్ (ఎన్‌సీపీఈడీపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ అభిప్రాయపడ్డారు.
Published date : 20 Aug 2021 07:21PM