ఆర్టిజన్ల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచినట్టు తెలంగాణ ట్రాన్స్‌కో ప్రకటించింది.
2021 మే 1 నుంచి ఆర్టిజన్లకు పర్సనల్ పే ఆధారంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తామని వెల్లడించింది. కార్మిక శాఖ కమిషనర్ నైపుణ్యం లేని శ్రామికుల కోసం నిర్దేశించిన కనీస వేతనాన్ని (జీతం+డీఏ+ఈపీఎఫ్+ఈఎస్) టీఎస్ ఎన్పీడీసీఎల్‌లోని అన్‌మ్యాన్డ్ ఉద్యోగులకు వర్తింపుజేస్తామని తెలియజేసింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్‌తో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తూ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు బుధవారం యూనియన్‌కు లేఖ రాశారు.
ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
- ఆర్టిజన్ గ్రేడ్–1 కోసం కొత్తగా సెలక్షన్ గ్రేడ్ పే–స్కేల్ ఖరారు చేస్తాం
- క్షేత్రస్థాయిలో పనిచేస్తూ టూర్లకు వెళ్లే ఆర్టిజన్లకు టీఏ, డీఏ సదుపాయం
- వాచ్‌మన్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టుల నుంచి జేఎల్‌ఎంగా కన్వర్షన్/అపాయింట్‌మెంట్ అయినవారికి, కారుణ్య నియామకాల కింద నియమితులైన జేఎల్‌ఎంలకు స్తంభం ఎక్కే పరీక్ష నుంచి ఒకసారి మినహాయింపు
- గ్రేడ్–4 మహిళా ఆర్టిజన్లకు సైతం నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు
- కోవిడ్–19 బారిన పడిన ఆర్టిజన్లకు 15 రోజుల ప్రత్యేక సెలవు
- 1104, టీఆర్‌వీకేఎస్, 1535 యూనియన్ నేత లకు ఫుల్‌టైం పర్మిషన్ (విధుల నుంచి మినహాయింపు). పురుష ఆర్టిజన్లకు పెటర్నిటీ సెలవు
- అన్ని విద్యుత్ సంస్థల్లో అవసరం మేరకు ఫోర్‌మన్ గ్రేడ్–1 పోస్టుల సృష్టి
- 2020 సెప్టెంబర్ 1 నుంచి ఆర్టిజన్లందరికీ వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లు
- సర్కిల్ నుంచి సర్కిల్‌కు, డివిజన్ నుంచి డివిజన్‌కు, ఒక విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి మరో విద్యుదుత్పత్తి కేంద్రానికి ఆర్టిజన్ల పరస్పర బదిలీలు
- ఇతర ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం
- విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేసే ఆర్టిజన్లకు లభ్యతను బట్టి క్వార్టర్లు
- అన్ని విద్యుత్ సంస్థల్లోని ఓఅండ్‌ఎం ఉద్యోగులకు ఎల్డీసీ/జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించడానికి ప్రతి ఏటా ఒకసారి స్క్రీనింగ్ పరీక్ష
- ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ఆధారంగా డయాలసిస్ చేయించుకునే ఉద్యోగుల వైద్య ఖర్చులను విద్యుత్ సంస్థలు చెల్లిస్తాయి
- ట్రాన్స్‌కోలో అవసరాల మేరకు ఫోర్‌మన్–1, ఫోర్‌మన్–2 పోస్టుల సృష్టి
- గ్రేడ్ల వారీగా ఆర్టిజన్ల సీనియారిటీ జాబితాల తయారీ. ఆర్టిజన్ల సర్వీసు రిజిస్టర్ల నిర్వహణను సత్వరంగా ప్రారంభిస్తారు
- 5 ఏళ్ల సర్వీసు పూర్తికాక ముందే మరణించిన ఆర్టిజన్ల కుటుంబాలకు నిబంధనల మేరకు గ్రాట్యుటీ చెల్లింపు
- డిస్కంలలోని ప్రతి ఆపరేషన్ సెక్షన్‌లో డివిజన్ యూనిట్‌గా 2 లైన్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సృష్టి
- విద్యుత్ ఉద్యోగుల తదుపరి పీఆర్సీ కమిటీకి సింగిల్ మాస్టర్ స్కేల్‌ను రూపొందించే బాధ్యతలు అప్పగింత
Published date : 29 Apr 2021 03:38PM