Skip to main content

ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావట్లేదు.. జూన్ దాకా పరీక్షలొద్దు..

సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత కోవిడ్ సమయంలో సరైన మార్గదర్శనం లేదు..
మాకు ఆన్‌లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. నాదే కాదు మా ఫ్రెండ్‌‌స అనేక మందిదీ ఇదే పరిస్థితి. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్‌లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’
- కరుణ శర్మ, 12వ తరగతి విద్యార్థిని

ఆన్‌లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి.
- అబు అనస్, విద్యార్థి

జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్‌‌సడ్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రస్తుతం ఆన్‌లైన్ బోధన సరిపోదు. ఈ ప్రిపరేషన్‌తో చాలా కష్టం. ఆన్‌లైన్ బోధన కూడా అందని నిరుపేద విద్యార్థులు ఉన్నారు. అందుకే ఆఫ్‌లైన్ బోధన ప్రారంభించండి.. మే నెల తర్వాతే ప్రవేశ పరీక్షలు పెట్టండి.
- శ్రీవత్స, మరో విద్యార్థి

ఇవీ ఇంటర్మీడియెట్‌లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు అనేక విజ్ఞప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న ఉదయం 10 గంటలకు ట్విట్టర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్‌ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్‌లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పరీక్షలకు ఉపయోగపడని ఆన్‌లైన్ బోధన
ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్‌లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే.
- పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జేఎల్ సంఘం అధ్యక్షుడు
Published date : 09 Dec 2020 02:51PM

Photo Stories