Skip to main content

ఆన్‌లైన్‌ – ఆఫ్‌లైన్‌ రెండింటి కూడికతో బోధనాభ్యసన ప్రక్రియకు యూజీసీ శ్రీకారం!

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 విపత్కర పరిస్థితుల్లో విద్యారంగం తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో ‘బ్లెండెడ్‌ మోడ్‌’ విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది.
బోధనాభ్యసన ప్రక్రియలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రెండింటినీ సమ్మిళితం చేయడమే ఈ బ్లెండెడ్‌ మోడ్‌. కరోనాతో విద్యాలయాలు మూతపడి బోధనాభ్యసన ప్రక్రియలు మందగించడంతో విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్‌ వంటి వైరస్‌ల వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలుండడంతో వాటిని ఎదుర్కొని ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందేలా యూజీసీ ఈ బ్లెండెడ్‌ మోడ్‌ విధానానికి రూపకల్పన చేస్తోంది. దీనిపై నిపుణులతో ముసాయిదా పత్రాన్ని రూపొందించి నిపుణులు, ఇతర ప్రజాభిప్రాయానికి విడుదల చేసింది.

ఫ్లెక్సిబిలిటీ అవసరం
కరోనా నేపథ్యంలో చదువులు సాఫీగా సాగాలంటే విద్యాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు, అధ్యాపకులిద్దరికీ ఫ్లెక్సిబిలిటీ అవసరం. బ్లెండెడ్‌ మోడ్‌ విధానం ముఖాముఖి తరగతి బోధనాభ్యసనాలను ఆన్‌లైన్‌ విధానాలతో సమ్మిళితం చేస్తుంది. విద్యార్థి, అధ్యాపకుడు తరగతి గదిలో ఉంటూనే మిశ్రమ అభ్యాసాన్ని కొనసాగించనున్నారు. డిజిటల్‌ సాధనాలను విద్యార్థులు ఉపయోగించుకోవడంతో పాటు డిజిటల్‌ లెర్నింగ్‌ మెటీరియళ్లను ఇతర సమయాల్లో వారు వినియోగించి అభ్యాసాన్ని కొనసాగించగలుగుతారు. విద్యార్థి కేంద్రంగా ఉన్నత విద్యాకార్యక్రమాలుండాలని నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నందున ఈ బ్లెండెడ్‌ మోడ్‌లో విద్యార్థులు తమ అభీష్టానుసారం అభ్యసనాన్ని కొనసాగించవచ్చు. బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పిస్తారు. భాషలు, కళలు, సామాజిక శాస్త్రాల అధ్యయనానికి అవకాశమిస్తారు. ఓపెన్‌ బుక్‌ టెస్టింగ్, గ్రూప్‌ ఎగ్జామ్స్‌ వంటివి నిర్వహిస్తారు. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ద్వారా విద్యార్థుల సమయం, వారి ఆసక్తికి తగ్గ కోర్సుల అధ్యయనానికి వీలు కలుగుతుంది.

ఫ్లిప్పడ్‌ తరగతి అభ్యసనం..
ఇది సంప్రదాయ తరగతి గది అభ్యసనానికి పూర్తిగా భిన్నమైనది. విద్యార్థి ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో వీడియోలు, ఇతర మెటీరియల్‌ ద్వారా తెలుసుకున్న అంశాలను తరగతి గదిలో సహచర విద్యార్థులు, టీచర్లతో బృంద చర్చల ద్వారా మరింత మెరుగుపర్చుకుంటాడు. ప్రాజెక్టు వర్కులు చేస్తారు. అభ్యసనం ఒకే తీరులో కాకుండా రొటేషన్‌ పద్ధతిలో చేయడానికి వీలుంటుంది. విద్యార్థి తన ఆసక్తి, సమయాలను అనుసరించి ఆయా కోర్సులు, డిగ్రీలను తమకు నచ్చిన సమయంలో పూర్తి చేసుకోవచ్చు. ఇవే కాకుండా..ఫ్లెక్సిబుల్‌ మోడ్‌ కోర్సులు, బ్లెండెడ్‌ మూక్స్‌ కోర్సులు, సెల్ఫ్‌ బ్లెండెడ్‌ మోడల్‌ అభ్యసనం కూడా ఉంటాయి.

బ్లెండెడ్‌ మోడ్‌ విధానం లక్ష్యాలు

అంశం

విధాన లక్ష్యం

టీచర్ల ఎంపిక, సమయాలు

ఫ్లెక్సిబిలిటీ, క్వాలిటీ

కోర్సుల ఎంపిక

అవసరం, ఆసక్తి

డిగ్రీల రూపకల్పన

విద్యార్థి కేంద్రీకృతం

ఏ విధానంలోనైనా అభ్యాసం

రియల్‌ వరల్డ్‌

డిమాండ్‌ ప్రకారం పరీక్షలు

విద్యార్థుల సంసిద్ధత ఆధారంగా


ప్రయోజనాలు..
అభ్యసన ప్రక్రియపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుదల, విద్యార్థి, అధ్యాపకుల మధ్య ఇంటరాక్షన్, అభ్యసన ప్రక్రియలో బాధ్యత పెంపు, టీమ్‌ మేనేజ్‌మెంట్, అభ్యసన ఫలితాలు మెరుగుదల, స్వయం, అనుభవ పూర్వక అభ్యసనం ద్వారా మంచి అవకాశాలు వంటివి ఈ బ్లెండెడ్‌ మోడ్‌లో విద్యార్థులకు మేలు చేకూర్చనున్నాయి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, సమస్యలకు స్వయంగా పరిష్కారం కనుగొనే నైపుణ్యాలు మెరుగవుతాయి. తరగతి గది బోధన అవసరం లేని అంశాలు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు తమకు ఏ అంశంపై ఆసక్తి ఉందో దానిపైనే దృష్టిని కేంద్రీకరించవచ్చు. వ్యక్తిగత ఆసక్తులు, వారి జీవన పరిస్థితులు, అభ్యాస అవసరాలకు తగ్గట్టుగా ముందుకెళ్లడానికి బ్లెండెడ్‌ మోడ్‌ ఉపకరిస్తుంది. >
Published date : 07 Jun 2021 01:56PM

Photo Stories