Skip to main content

అంకితభావంతో అభ్యాసం..!

ఏ పనినైనా మొక్కుబడిగా చేయకూడదు. లీనమైపోయి చేయాలి. అప్పుడే అందుకు తగ్గ ఫలితాలు వస్తాయి. మొక్కుబడిగా చేస్తే అటువంటి ఫలితమే వస్తుంది.
అందుకే అభ్యాసం కూసువిద్య అనే నానుడి వచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అంటాడు గీతాచార్యుడు. శ్రద్ధ కలిగిన వారికే జ్ఞానం లభిస్తుందని గీతాచార్యుడి బోధ. అంకితభావం అంటే పుస్తకం పట్టుకుంటే మరో ఆలోచన మన మనసులోకి రాకపోవడం. మనసంతా చదువుపైనే లగ్నం కావడం. అయితే ఈతరం పిల్లలకు మొబైల్‌ఫోన్లపై ఉన్న ధ్యాస పుస్తకాలపై ఉండడం లేదు. పట్టుమని ఓ అర్ధగంటపాటు కుదురుగా కూర్చొని చదువుకోలేకపోతున్నారు. ఇటువంటి చదువు ఎవరికీ ఉపయోగపడదు. విద్యార్థులంటే భావి భారత పౌరులు. భావిభారత నిర్మాతలు. ఇంజనీర్లు, వైద్యులుగా ఎదిగి దేశాన్ని ముందుకు నడిపించాల్సినది వీరే. మరి వీరు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు చదువుకుంటే దేశం అభివృద్ధి సంగతలా ఉంచి విద్యార్థి భవితవ్యం మాటేమిటి. అందువల్ల ప్రతి విద్యార్థి ఒక పట్టువదలని విక్రమార్కుడు కావాలి. నాకు మంచి మార్కులు రావాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితం గడపాలనే లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం ఉన్నప్పుడే పట్టుదల వస్తుంది. కష్టపడి చదువుకుంటే సాధించలేనిదనేదేదీ ఉండదు. ఇక విద్యార్థులు చదువుతోపాటు జ్ఞానం కూడా సముపార్జించాలి. జ్ఞానం అంటే అందరిలో దేవుడిని చూడడం. అందరూ దేవుళ్లేనని భావించడం, అందరినీ దేవుళ్లుగా భావించి వారికి అవసరమైన సేవలు అందించడం. వాస్తవానికి ప్రతి మనిషిలోనూ దేవుడు అంతర్యామిగా ఉంటాడు. భగవంతుడు కొలువుదీరినంతసేపే జీవుడిలో చలనం ఉంటుంది. ఆయన తప్పుకున్ననాడు ఈ శరీరం ఎందుకూ పనికిరాకుండాపోతుంది. అప్పటిదాకా ఏదో ఒక పేరుతో పిలుస్తాం. చనిపోగానే ఏ పేరూ ఉండదు. శవం అని మాత్రమే అంటాం. కనుక అంతర్యామి మనలో ఉన్నంతకాలం ఎదుటివారిని దేవుడిగా భావించి వారిని ప్రేమతో పలకరించాలి. ఆప్యాయత, అనురాగం పంచాలి.
Published date : 10 Jan 2020 04:15PM

Photo Stories