Skip to main content

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఆపొద్దు: సత్యవతి రాథోడ్

సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ పౌష్టికాహార పంపిణీని ఆపవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం డీఎస్‌ఎస్ భవన్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ తదితరులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు వండి, పంపిణీ చేయాలన్నారు. ఈ పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి ఫలితాలు వస్తాయని, ఈమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసే అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

లక్షణాలుంటే సమాచారమివ్వండి
కోవిడ్ లక్షణాలున్నట్లు గుర్తిస్తే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన పరిశుభ్రత చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుమికూడకుండా ఉపాధ్యాయులు వెంట ఉండి పర్యవేక్షించాలన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. అనంతరం మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్బన్ కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాథోడ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ మూడు జిల్లాలకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు.
Published date : 21 Mar 2020 03:19PM

Photo Stories