Skip to main content

అమ్మఒడితో విద్యా విప్లవం: సీఎం వైఎస్ జగన్

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చిత్తూరులో గురువారం ఆయన అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో ఎదుగుతుంది. ఆ తల్లి గుండెల్లో పెట్టుకుని బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తల్లి తన కంటే ప్రాణంగా బిడ్డలను చూసుకుంటుంది. అలాంటి తల్లులను, అక్కచెల్లెమ్మలను నా 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్రలో చూశాను. వారికి పిల్లల చదువులు భారం కాకుడదని భావించాను. అందుకే ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోరు
‘అమ్మఒడి పథకం ద్వారా చేకూరే లబ్ధి బ్యాంకర్లు మునపటి అప్పులకు జమ చేసుకోకూడదని సూచించాం. బ్యాంకర్లు సహకరించారు. ఈ పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వీరికి రూ.6,456 కోట్లు చెల్లించనున్నాం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి ప్రవేశపెట్టనున్నట్లు పాదయాత్రలో చెప్పాను. ప్రస్తుతం ఇంటర్ వరకు వర్తింప చేస్తున్నాం. వరుసగా ప్రతి ఏటా తల్లుల అకౌంట్‌లో రూ.15 వేలు జమ అవుతుంది. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని, తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుంది.

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు ఉండాలి. నాణ్యమైన విద్యను అందించినప్పుడే పేద పిల్లలు లక్ష్యం చేరుకుంటారు. అందుకే పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేందుకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టబోతున్నాం. రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం. తెలుగు మీడియం పిల్లలకు కొంత ఇబ్బంది వస్తుంది. దీన్ని అధిగమించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కోర్సులు ప్రవేశ పెట్టాం. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ఇలా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్‌లో రాసే పరిస్థితి వస్తుంది. కొందరు ఇంగ్లిష్ మీడియం వద్దంటున్నారు. ఈనాడు పేపర్‌కు, చంద్రబాబునాయుడుకు, సినిమా యాక్టర్‌కు విన్పించేలా మీ అభిప్రాయం గట్టిగా చెప్పండి. (కావాలంటూ ప్రజలు నినాదాలు చేశారు) 2020 జూన్‌లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నాం. అప్పుడు 6వ తరగతి చదివే పిల్లలకు 2030లో డిగ్రీ పూర్తి అవుతుంది. 2032లో పీజీ చేస్తారు. 2020లో పుట్టిన పిల్లలు 2040లో డిగ్రీ పూర్తి చేస్తారు. ఆ నాటికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడతారు. ఆ మేరకు ప్రభుత్వ బడులను మార్చేస్తాం. సిలబస్‌లో మార్పు తెస్తాం. పేదరికంలో ఉన్న వారి బతుకులు మారాలి. కుల వృత్తితో అన్యాయమైన బతుకు కొనసాగకూడదు.

మరో కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో మార్పులు
విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. మంచి ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. పిల్లల భోజనం మెనూ విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించి ఉండరు. మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు వెయి్య రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం వల్ల రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం.

ఆ మెనూ ఇలా...
  • సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ
  • మంగళవారం : పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు
  • బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
  • గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
  • శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
  • శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్

నాడు - నేడుతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు
రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మార్పు తెస్తాం. శిథిలావస్థలో ఉన్న బడులను చదువుల దేవాలయాలుగా మార్చాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు బడుల ఫొటోలు తీశాం. వాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేసిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి చూపిస్తాం. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తాం. మొదటి దశగా ఈ సంక్రాంతి తర్వాత 15,745 బడుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టాయిలెట్లు, మంచినీళ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పర్నిచర్, గ్రీన్ బ్లాక్ బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్లు, ఇతర మరమ్మతులు, ఇంగిస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. సగం విద్యా సంవత్సరం గడిచిన తర్వాత గానీ పుస్తకాలు అందని పరిస్థితిని ఏటా చూస్తున్నాం. ఈ పరిస్థితిని మారుస్తూ.. స్కూళ్లు తెరిచే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరీకి స్కూల్ కిట్ అందజేస్తాం. అందులో 3 జతలు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందజేస్తాం. భోదన ప్రమాణాలు పెంచడంతోపాటు, టీచర్లకు శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం.

విద్యా దీవెనతో ఆదుకుంటాం
ఇంటర్మీడియట్ తర్వాత 23 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. మిగతా 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదరికంలో ఉన్న మైనార్టీలు, ఇతర వర్గాల్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులు మానేస్తున్నారు. అలాంటి వారి కోసం విద్యా దీవెన పథకం ప్రవేశ పెట్టాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా తోడుగా ఉంటాం. ఎంతటి చదువులైన చదివేందుకు అవకాశం కల్పిస్తాం. పేదవారికి తోడు-నీడగా ఉండేందుకు వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో రూ.10 వేలు.. జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్‌లో హాస్టల్ ఖర్చుల కోసం జమ చేస్తాం’ అని సీఎం అన్నారు.

పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా..
భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకాన్ని రూపొందించాం. స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. మీ స్కూల్ పనితీరులో మీ భాగస్వామ్యం కూడా కావాలి. మీ పిల్లలు వెళ్లే పాఠశాల వాచ్‌మన్ మీద, బాత్‌రూమ్‌ల మీద కాస్త ధ్యాస పెట్టండి. బాత్‌రూం నిర్వహణ, వాచ్‌మన్ జీతం కోసం మీరూ భాగస్వాములు కావాలి. అప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది. అందుకోసం మీకు అందించే రూ.15 వేలల్లో రూ.వెయి్య పాఠశాల నిర్వహణ కోసం పేరెంట్స్ కమిటీకి అప్పగించండి. పాఠశాల రూపురేఖలు మారినా, నిర్వహణ బాగోలేకపోతే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అందుకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అక్కచెల్లెమ్మలు తీసుకోవాలి. ప్రతి తల్లికి అన్నాగా తోడుగా ఉంటూ.. పిల్లలకు మంచి మేనమామగా అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం ల్యాప్‌టాప్ ద్వారా బటన్ నొక్కి అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

విప్లవాత్మక విద్యకు ఈ పథకాలతో రాచబాట..!

పథకం పేరు

ఉద్దేశం

వ్యయం

జగనన్న అమ్మఒడి

పిల్లలందరినీ బడికి పంపాలి

రూ.6,456 కోట్లు

మధ్యాహ్న భోజనం

పేద పిల్లలకు పౌష్టికాహారం

అదనంగా రూ.360 కోట్లు

నాడు-నేడు

స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన

రూ.14,000 కోట్లు

జగనన్న విద్యా దీవెన

అర్హతగల ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్

పూర్తి ఫీజు

జగనన్న వసతి దీవెన

హాస్టల్ ఖర్చులనూ ప్రభుత్వమే భరించడం

ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు

Published date : 10 Jan 2020 04:30PM

Photo Stories