Skip to main content

అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి అనిక చేబ్రోలు

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 చికిత్సకు ఉపకరించే ఆవిష్కరణపై పనిచేసిన 14 ఏళ్ల టెక్సాస్‌ (ఫ్రిస్కో) బాలిక జాతీయ అవార్డును గెలుపొందారు.
తెలుగమ్మాయి అనిక చేబ్రోలు ఇండిపెండెన్స్‌ హైస్కూల్‌లో చదువుతూ ఇటీవల 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌లోనూ గెలుపొంది 25,000 డాలర్లను సొంతం చేసుకున్నారు. "తాను అభివృద్ధి చేసిన ఈ అణువు సార్స్‌ కోవిడ్‌-2 వైరస్‌పై ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ను నిలువరిస్తుంద"ని తన ఆవిష్కరణపై అనిక చేబ్రోలు చెప్పుకొచ్చారు. ఈ ప్రొటీన్‌ను బంధించడం ద్వారా ఇది వైరస్‌ ప్రోటీన్ పనితీరును ఆపివేస్తుందని, దీన్ని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్‌తో ప్రారంభించానని బాలిక వివరించారు. కొద్ది నెలల కిందట ఈ పోటీలో ఆమె పొల్గొన్న సమయంలో ఆమె మిడిల్‌ స్కూల్‌లో ఉన్నారు. తొలుత స్వైన్‌ ఫ్లూపై తన ప్రాజెక్టును రూపొందించుకోగా ఆపై కోవిడ్‌-19పై పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్‌ బారినపడటంతో తన ప్రాజెక్టు విస్తృతి దృష్ట్యా కరోనా వైరస్‌పై పరిశోధనను ఎంపిక చేసుకున్నానని అనిక చెప్పారు. తాను స్కూల్‌ విద్యను ముగించిన తర్వాత వైద్య పరిశోధకురాలిగా కెరీర్‌ను ఎంచుకుంటానని తెలిపారు. కెమిస్ర్టీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తాత ప్రోత్సాహంతో తనకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెరిగిందని తెలిపారు. ఇక అనిక చేబ్రోలు తండ్రి వైద్య వృత్తిలో ఉన్నారు.
Published date : 16 Oct 2020 02:44PM

Photo Stories