Skip to main content

అలాంటి వారే ‘యూనివర్సిటీ టీచర్‌’..

సాక్షి, అమరావతి: యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లో విద్యా బోధన, పరిశోధనలో మార్గదర్శిగా వ్యవహరించేందుకు యూనివర్సిటీ ద్వారా నియమితులైన వ్యక్తి మాత్రమే ‘యూనివర్సిటీ టీచర్‌’ నిర్వచన పరిధిలోకి వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఓ వర్సిటీలో పనిచేసే ఉద్యోగి.. ఇతర వర్సిటీల్లో ‘పరిశోధన’లకు మార్గదర్శిగా ఉన్నంత మాత్రాన.. ఆ ఉద్యోగిని తను పనిచేసే వర్సిటీలో టీచర్‌గా పరిగణించజాలరని తేల్చిచెప్పింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ శాఖ (ఎల్‌ఐఎస్‌డీ)లో పనిచేస్తున్న లైబ్రేరియన్లు రెగ్యులర్‌ బోధన సిబ్బంది కిందకు రారని తెలిపింది. కాబట్టి రెగ్యులర్‌ వర్సిటీ టీచర్లకు వర్తించే పదవీ విరమణ వయసు (62) నిబంధన వీరికి వర్తించదని పేర్కొంది. అందువల్ల వీరికి 60 ఏళ్లకే పదవీ విరమణ వర్తింప చేయడంలో తప్పులేదంది. ఆచార్య నాగార్జున వర్సిటీలో లైబ్రేరియన్లుగా పనిచేస్తూ.. తర్వాత లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ శాఖలో వివిధ హోదాల్లోకి మారిన పలువురిని ‘టీచర్లు’గా పరిగణించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. పిటిషనర్లలో ఒకరైన కె.వెంకట్రావు గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేశారంది. ‘గెస్ట్‌ ఫ్యాకల్టీ’ని ఆ వర్సిటీ రెగ్యులర్‌ టీచర్‌గా పరిగణించడానికి ఎంత మాత్రం వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండానే తీర్పునిచ్చారంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

వివాదం ఇదీ..
ఆచార్య నాగార్జున వర్సిటీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ శాఖలో లైబ్రేరియన్లుగా పనిచేస్తూ.. తర్వాత వివిధ హోదాల్లో రీడిజిగ్నేట్‌ అయిన తాము బోధన సిబ్బంది కిందకే వస్తామని, అందువల్ల తమకూ 62 ఏళ్ల పదవీ విరమణ వయసును వర్తింప చేయాలని, తమను 60 ఏళ్లకే పదవీ విరమణ చేయించడం సరికాదంటూ కె.వెంకట్రావు మరికొందరు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, పిటిషనర్లు వర్సిటీ టీచర్లే అవుతారని, అందువల్ల వారికి 62 ఏళ్ల పదవీ విరమణ వయసును వర్తింప చేయాలని నాగార్జున యూనివర్సిటీని ఆదేశించారు. దీనిపై అటు యూనివర్సిటీ, ఇటు ఉన్నత విద్యాశాఖ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వెంకట్రావు, తదితరులను పదవీ విరమణ చేయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇలా చేయడం ద్వారా వర్సిటీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుందని ఆక్షేపించింది. ఇలాంటి ఉల్లంఘనల విషయంలో తాము మౌన ప్రేక్షకుడిగా ఉండబోమని, పిటిషనర్లకు ఎప్పటి నుంచి జీతభత్యాలు ఆపేశారో ఆ నాటి నుంచి ఈ తీర్పునిచ్చే తేదీ వరకు జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని, వర్సిటీ అధికారులను ఆదేశించింది.
Published date : 14 Apr 2021 03:43PM

Photo Stories