Skip to main content

అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు!!

సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీల గుర్తింపు రద్దు తప్పదని రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు హెచ్చరించారు.

నిబంధనలకు విరుద్ధంగా వేర్వేరు పేర్లతో ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థులను ఇబ్బందికి గురిచేయడం నేరమని, అలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన కమిషన్ వైస్ చైర్‌పర్సన్ విజయశారదారెడ్డి, సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఫీజులో 30 శాతం మేర కుదించి తక్కిన ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే అనేక కాలేజీలు ట్యూషన్ ఫీజును పెంచేసి, ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు చూపడం, ఇతరేతర పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా కాలంలో, ఇటీవల కమిషన్.. దాదాపు 360 స్కూళ్లు, కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. తనిఖీల్లో అధిక ఫీజులతో పాటు అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. 25 స్కూళ్లు, 50 కాలేజీలపై చర్యలకు సిఫార్సు చేశామన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కు ఇవ్వని పక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలేజీల గుర్తింపు రద్దుతో పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా వారి కోసం ఇతర కాలేజీల్లో సీట్లు పెంచేలా చూస్తామని, తల్లిదండ్రులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇది మరింత సులువు అవుతుందని చెప్పారు. ఫీజులు ఫిక్స్ చేసి, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్లో అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. కొన్ని కాలేజీలు ఫీజు బకాయి పేరిట సర్టిఫికెట్లు ఇవ్వక పోవడం నేరం అని, అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆ కాలేజీల్లో పిల్లల పరిస్థితి దయనీయం
‘శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల్లో తనిఖీలు చేపట్టాం. పిల్లలను తరగతి గదుల్లో రోజూ 12 గంటలు ఉంచుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తమ సమస్యలను కమిషన్ గ్రీవెన్స్ నంబర్ 9150281111కు తెలపవచ్చు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం’ అని కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి తెలిపారు. మరో సభ్యుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐఐటీ, జేఈఈ, నీట్ అంటూ తప్పుడు ప్రకటనలతో కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. ఇలాంటి కోచింగ్‌లకు కాలేజీలకు ఇంటర్ బోర్డు ఎలాంటి అనుమతులు ఇవ్వదని చెప్పారు. కేవలం కోర్సులు మాత్రమే నిర్వహించాలని, ఈ కోచింగ్‌ల పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేయడం నేరం అని.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరో సభ్యుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ ‘కొన్నింటిలో ఒకేసారి రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. గత ఏడాది కన్నా రెట్టింపు ఫీజులను వసూలు చేస్తున్నారు.’ అని తెలిపారు.

కొన్ని విద్యా సంస్థల్లో భయంకరమైన పరిస్థితులు
తమ తనిఖీల్లో పలు కాలేజీల్లో భయంకరమైన పరిస్థితులను గమనించామని, పశువుల కొట్టాలకన్నా అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని వైస్ చైర్‌పర్సన్ విజయశారదా రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి కాలేజీలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కొన్ని విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజుతో పాటు కోచింగ్, హాస్టల్, బుక్స్, లాంగ్‌టర్మ్, లైబ్రరీ ఇలా వేర్వేరు పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని కాలేజీలు ఏడాదికి రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా, కొన్నింటిలో రెండేళ్లకు కలిపి ఒకేసారి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. పలు కాలేజీల్లో తనిఖీల సమయంలో రికార్డులు, అకౌంటు పుస్తకాలు చూపించడం లేదని, ఇకపై కమిటీ తనిఖీల సమయంలో అకౌంటెంట్లను కాలేజీల్లో అందుబాటులో ఉంచాలని ఆమె స్పష్టం చేశారు.

Published date : 23 Jan 2021 04:37PM

Photo Stories