Skip to main content

ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు!

సాక్షి, చిన్నశంకరంపేట (మెదక్ జిల్లా): ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు.
స్థానికుల సహకారంతో కార్పొరేట్ పాఠశాలలో ఉండే సదుపాయాలు కల్పించారు. స్థానికంగానే నివాసం ఉండాలనే నియమాన్ని పాటిస్తూ పాఠశాలలోనే గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాపో ధ్యాయుడు నర్సింగరావు.

నాలుగేళ్ల క్రితం ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. విరిగిన బెంచీలు, పగిలిపోయిన శ్లాబులు. వర్షమొస్తే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. అటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాలకు బదలీపై వచ్చారు నర్సింగరావు. పరిస్థితిని గమనించిన ఈ మాస్టారు. పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారించారు. దాతల సహయం కోరారు. పాఠశాల పైకప్పును సరిచేసేందుకు స్థానిక పరిశ్రమ సహాయం పొందారు. గ్రామానికి చెందిన ఉప ఎంపీపీ విజయలక్ష్మి జిరాక్స్ మిషన్, నీటి శుద్ధి యంత్రం అందించారు. గత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రస్తుత సర్పంచ్ కుంట నాగలక్ష్మి, సిద్ధిరాములు దంపతులు రూ.36 వేల విలువగల ప్రొజెక్టర్‌ను అందించారు. స్థానికుడు అప్పన్నగారి రాజేశ్ రెండు టీవీలను అందించారు. స్థానిక కావేరీ పరిశ్రమ సహకారంతో కో-ఆర్డినేటర్లను నియమించుకుని విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం ప్రారంభించారు.

ప్రత్యేక సదుపాయాలు
పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చేందుకు హెచ్‌ఎం నర్సింగరావు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో విజ్ఞానం అందించే పుస్తకాలతోపాటు నీతి కథల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా విద్యార్థులు ఆ పుస్తకాలను చదివేలా చర్యలు తీసుకున్నారు. అలాగే పాఠశాల కార్యాలయంతో పాటు తరగతి గదుల్లోను ప్రత్యేకంగా బాలబాలికలకు స్ఫూర్తినిచ్చే దేశనాయకుల చిత్రపటాలు, మాజీ ప్రధానులు, రాష్ట్రపతులతో పాటు ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి చిత్రపటాలను వరుసగా ఏర్పాటు చేశారు. పాఠశాల గోడలపై దేశనాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో స్థానిక ఎస్‌ఎంసీ చైర్మన్ బాలస్వామి సహకారంతో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఇలా పాఠశాలను ప్రత్యే కంగా తీర్చిదిద్ది పలువురికి ఆదర్శంగా నిలిచారు.

విద్యార్థులను తీర్చిదిద్దాలనే...
నేను ఎక్కడ పనిచేసినా అదే గ్రామంలో ఉంటూ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు పొందే లా కృషి చేశా. ముఖ్యంగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే నా డబ్బు వెచ్చించా. అంతేకాకుండా దాతల విరాళాలతో పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తున్నా. గ్రామస్థుల సహ కారంతోనే పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించగలిగా. సోమవారం నుంచి శనివారం వరకు పాఠశాల అవరణలో ఉంటున్నా.
- కోటి నర్సింగరావు, ప్రధానోపాధ్యాయుడు
Published date : 25 Jan 2020 03:06PM

Photo Stories