Skip to main content

అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనతోఉద్యోగుల భద్రత బాధ్యత వీఆర్‌ఏలకు అప్పగింత!

సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యం లో నిర్మల్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయోగం చేపట్టింది.
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు కొత్త రూపు ఇచ్చింది. వారికి ‘రక్షణ’విధులు అప్పగించింది. రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సందర్శకుల రాకపోకలపై కన్నేసి ఉంచేందుకు సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే వారిలో కొందరు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదనే ఆక్రోశంతో అధికారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 4న తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆమె కార్యాలయంలోనే ఓ రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన ఈ కోవలోనిదే. విజయారెడ్డి సజీవదహనం ఉదంతంతో అవాక్కయిన రెవెన్యూ యంత్రాంగం... వారం పాటు విధులు బహిష్కరించింది. రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించడంతో రంగంలోకి దిగిన సర్కారు రెవె న్యూ ఉద్యోగుల విధుల నిర్వహణకు పోలీసు రక్షణ కల్పించింది. కానీ క్రమేణా కానిస్టేబుళ్లను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యానే నిర్మల్ జిల్లా అధికారులు వీఆర్‌ఏలకు సెక్యూరిటీ గార్డు విధులు అప్పగించాలని నిర్ణయించారు. అయితే డ్రెస్‌కోడ్‌తో కొత్త అవతారమెత్తిన వీఆర్‌ఏల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే మండల కార్యాలయాలు, అధికారుల వద్ద ఆర్డర్లీ సేవలందిస్తున్న వీఆర్‌ఏలను తాజాగా సెక్యూరిటీ గార్డులుగా నియమించడంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

డ్రెస్‌కోడ్‌పై గరంగరం!
వాస్తవానికి వీఆర్‌ఏల ప్రధాన విధి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)కి సహాయకులుగా వ్యవహరించడం. అలాగే అధికారుల గ్రామ సందర్శనలో సహాయకారిగా వ్యవహరించడంతోపాటు లేఖలను ఉన్నతాధికారులకు చేరవేయడం జాబ్‌చార్ట్‌లో భాగం. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండటంతో దాదాపు అన్ని మండల కార్యాలయాల్లో వీఆర్‌ఏల సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విడతలవారీగా ఆయా గ్రామాల వీఆర్‌ఏలను మండల ఆఫీసుల్లో విధులకు వినియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం, ఆ తర్వాత కొన్ని మండలాల్లోనూ పెట్రోల్ సీసాలు, భౌతికదాడులకు పాల్ప డతామంటూ కొందరు ఫిర్యాదుదారులు హెచ్చరికలకు దిగడంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం వీఆర్‌ఏలను సెక్యూరిటీ గార్డులుగా మార్చేసింది. అయితే విధుల నిర్వహణపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా డ్రెస్‌కోడ్‌పై మాత్రం ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతవిద్య అభ్యసించి వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న తమకు డ్రెస్‌కోడ్‌ను వర్తింపజేయడం అవమానపరచడమేనని మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, తక్షణమే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపరిపాలన శాఖ డెరైక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు.

ప్రతి మండలం నుంచి ముగ్గురు...
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో రెవెన్యూ అధికారుల రక్షణ కోసం సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతి మండలం నుంచి ముగ్గురు వీఆర్‌ఏలను ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళా వీఆర్‌ఏకు స్థానం కల్పించారు. 19 మండలాల నుంచి సెక్యూరిటీ గార్డులుగా విధుల కోసం 57 మందిని ఎంపిక చేసి వారికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. అధికారులను కలిసేందుకు వచ్చే వారిని చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపడం, వారు తెచ్చుకున్న చేతిసంచులు, పత్రాలను పరిశీలించి, ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ పనిపై వచ్చారనే విషయాన్ని ఆరా తీయడం, అనుమానస్పదంగా ఉంటే వారిని అడ్డుకోవడం.. తదితర అంశాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు.
Published date : 10 Feb 2020 03:58PM

Photo Stories