4, 5 గంటలు స్క్రీన్ ముందుంటే పిల్లల ఆరోగ్యం ఏం కావాలి ? : టీఎస్ హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులపై రాష్ట్ర హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వ నిర్ణయాల్లోని అసంబద్ధతను ఎత్తిచూపింది. ‘‘కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకు నాలుగు నుంచి ఐదు గంటలపాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అన్ని గంటలపాటు స్క్రీన్ ముందు కూర్చుంటే వారి మానసిక, శారీరక ఆరోగ్యం ఏం కావాలి. రెండు, మూడు గంటల కంటే ఎక్కువసేపు మేమే స్క్రీన్ ముందు కూర్చోలేకపోతున్నాం. ఇక పిల్లలెలా కూర్చుంటారు’’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఆన్‌లైన్ క్లాసులు, దూరవిద్య తరగతులకు అనుమతులు ఇవ్వాలని బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించిందని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్ నివేదించారు. విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా... దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఈ నెల 31 వరకు మాత్రం పాఠశాలలను తెరవకూడదని ఆదేశించామని సంజీవ్‌కుమార్ నివేదించారు. విద్యాసంవత్సరం ప్రారంభంపై నిర్ణయం తీసుకోకుండానే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని ఎలా నిర్ణయం తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం భిన్నమైన అభిప్రాయాలను, వాదనలను వినిపిస్తోందని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్లలను పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఏకాగ్రతతో కూర్చోబెట్టడం కష్టమని, అలాంటిది వారిని నాలుగైదు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడం తల్లిదండ్రులకు చాలా కష్టమైన పనని ధర్మాసనం పేర్కొంది. ఆన్‌లైన్ క్లాసులపై తమ అభిప్రాయం చెప్పేందుకు మరికొంత గడువు కావాలనీ సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే తిరిగి వెనక్కి..
ఫీజులు వసూలు చేయరాదంటూ జారీ చేసిన జీవో 46కు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇంప్లీడ్ చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇలా తల్లిదండ్రులను ఇంప్లీడ్ చేస్తూ పోతే వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ వాదన వినాలంటూ వచ్చే అవకాశం ఉందంటూ ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టివేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసి ఉంటే తిరిగి వెనక్కు ఇప్పిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Published date : 07 Aug 2020 01:42PM