Skip to main content

30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే నెలకు అదనపు ఖర్చు రూ. 750 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేస్తే ఎంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందన్న అంచనాలపై ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలు వేసింది.
నిత్యావసర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచడమే ఫిట్‌మెంట్‌. దాన్ని 30 శాతంతో అమలు చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపిన నేపథ్యం లో 1 శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.300 కో ట్లు వెచించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా చూస్తే 5.29 లక్షల మందికి వేతన సవరణను అమలు చేస్తే ఏటా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. అంటే నెలకు రూ.750 కోట్లు అదనంగా ప్రభుత్వం వెచ్చించాల్సి రానుంది. మరోవైపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలను పెంచితే ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం పెరగనుంది. మరోవైపు కొత్తగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తే ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ. 1000 కోట్లకుపైగా ఆర్థిక భారం పడనుంది.

చదవండి: ఈ ఏడాది కొత్త ఐటీ కొలువులు.. 46,489
Published date : 12 Jun 2021 01:53PM

Photo Stories