ఆ 238 కాలేజీలకు అనుమతులివ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరం కోసం అనుమతులు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి రాష్ట్ర సీఎస్ సోమేశ్కుమార్ లేఖ రాశారు.
హైదరాబాద్ పరిసరాల్లోని 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో 238 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటి భవన నిర్మాణాల రెగ్యులరైజేషన్ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ భవనాల నిర్మాణాల రెగ్యులరైజేషన్ కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. కోర్టు కేసులు, నిఫుణుల కమిటీ నివేదిక రాకపోవడం, కోవిడ్ తదితర కారణాల వల్ల ఆ దరఖాస్తులను స్క్రూ టినీ చేయలేదని నివేదించారు. 111 జీవో పరిధిలోని ఆయా కాలేజీల భవన నిర్మాణాలకు అనుమతులు లేవని, అనుమతులు తెచ్చుకుంటేనే తాము కాలేజీలకు అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ రెండేళ్ల కిందటే నోటీసులు జారీ చేసింది. యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఏఐసీటీఈకి లేఖ రాసింది. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనగా, తాము నిర్మాణాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, అనుమ తులు ఇవ్వాలని కాలేజీలు కోరాయి. రాష్ట్ర ప్రభు త్వం కూడా లేఖ రాయడంతో ఏఐసీటీ ఈ అనుమతులు ఇచ్చింది. ఈసారి కూడా అనుమతుల కోసం ఏఐసీటీఈకి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో 2021–22 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏఐసీటీఈ త్వరలోనే అనుమతులు జారీ చేస్తుందని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
Published date : 30 Apr 2021 03:09PM